సాఫీగా ‘పట్టభద్రుల’ ఎన్నికలు

Shashank Goyal Talks About MLC Elections - Sakshi

ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు పరిశీలిస్తున్నాం 

 తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ చర్యలు...

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు:రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌...

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు అవకాశం కల్పించాలని సూచించారు.

పోలింగ్‌ తీరుతెన్నులపై అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్, సీసీ కెమెరాలు, ఇతర కెమెరాలతో వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 50 ఫిర్యాదులు అందాయని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల బాధ్యతని.. తద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్నారు. పోలింగ్‌ రోజున అభ్యర్థికి రెండు వాహనాలతో పాటు ప్రతీ జిల్లాకు అదనంగా ఒక వాహనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయిందని శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయడంతో పాటు, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top