
రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణాంకాలను వెల్లడించిన ఆర్‌బీఐ
2024–25 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తెలంగాణ ఆర్థిక పరపతి
2023–24తో పోలిస్తే రూ.1.3 లక్షల కోట్లు పెరిగిన జీఎస్‌డీపీ
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడు రెట్లు పెరిగిన ఎన్‌ఎస్‌డీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏటేటా గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రూ.10 లక్షల కోట్లకు పైగా స్థూల ఉత్పత్తి నమోదు కాగా, తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14.56 లక్షల కోట్లకు చేరింది. అంటే గత నాలుగేళ్లలోనే దాదాపు 50% పెరిగిందన్నమాట.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల వెలువరించిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్ ఆన్ ఇండియన్ ఎకానమీ లో ఈ గణాంకాలను పొందుపరిచింది. ఈ కరదీపిక ప్రకారం 2023–24లో తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.13,22, 808 కోట్లు కాగా, ఏడాది కాలంలో 1.3 లక్షల కోట్లు పెరిగి రూ.14,56,837 కోట్లుగా నమోదైంది.
తలసరి ఉత్పత్తి రూ.3 లక్షల పైమాటే: ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ తలసరి స్థూల ఉత్పత్తి రూ.3.79 లక్షలకు చేరింది. 2024–25లో రూ.3,79,751గా తలసరి స్థూల ఉత్పత్తి నమోదైందని, ఇది 2023–24తో పోలిస్తే రూ.33 వేలు పెరిగిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన ఏడాది 2014–15లో తలసరి స్థూల ఉత్పత్తి రూ.1,24,104 కాగా, ఇప్పుడు మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది.
పదేళ్ల కాలంలో 2.55 లక్షలు పెరిగింది. ఇక, రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణాంకాలు కూడా ఇదే నిష్పత్తిలో పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటైన ఏడాది తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.4,56,280 కోట్లు కాగా, పదేళ్ల తర్వాత ఏకంగా రూ.10 లక్షల కోట్లు పెరిగింది.
» ఆర్‌బీఐ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి నమోదులో పురోగతిని కనబరుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ (రూ.14,22,998 కోట్లు), కర్ణాటక (రూ. 26,03,948 కోట్లు), తమిళనాడు (రూ. 27,64,755 కోట్లు)లు కూడా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలిచాయి.
» తెలంగాణ విషయానికి వస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు సేవల రంగం విస్తృతి కారణంగా భారీ స్థాయిలో జీఎస్‌డీపీ నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.