ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలా? ఇవి ఫాలో అవండి

Process To Cast Vote In MLC Graduates Elections - Sakshi

ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికలు

బరిలో 71మంది అభ్యర్థులు

సత్తుపల్లి: ఈ నెల 14న నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఓటింగ్‌ సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం. ఎన్నికల కమిషన్‌ సూచించిన గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. పోలింగ్‌ అధికారి బ్యాలెట్‌ పేపర్, పెన్ను ఇస్తారు. పేపర్‌పై పోటీ చేసిన అభ్యర్థుల పేరు, ఫొటో, పార్టీ లేదా స్వతంత్ర తదితర వివరాలు ఉంటాయి.

బ్యాలెట్‌ పేపర్‌పై వారిచ్చే పెన్నుతోనే నంబర్‌ వేయాలి. ఈ సారి ఎన్నికల్లో 71 మంది బరిలో ఉన్నారు. మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉండే బాక్సులో 1 అని నంబర్‌ వేయాలి. ఇలాగే రెండో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 2, మూడో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 3 అని అంకెలు వేయాలి. ఇలా 71 మందికీ మీ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయొచ్చు. లేకపోతే కొందరికైనా వేయొచ్చు. అయితే ప్రాధాన్యత క్రమం తప్పవద్దు. ఉదాహరణకు ఒక ఓటరు నలుగురికి ఓటువేద్దామనుకుంటే.. ఒకరికి 1, ఇతరులకు 2, 3, 4 ఇలా నంబర్లు వారి పేరుకు ఎదురుగా గల బాక్స్‌ల్లో రాయాలి.

కౌంటింగ్‌ ఇలా.. 
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ పెద్ద ప్రహాసనం. రెండు, మూడు రోజులు కౌంటింగ్‌ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్‌కు ఏజెంట్‌కు వెళ్లాలంటేనే కనీసం రెండు రోజులు గడుపుతామనే భావన ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు 100 ఓట్లు పోలైతే 51 తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికొస్తాయో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ‘ఏ’అనే అభ్యర్థికి 46, బీ అనే అభ్యర్థికి 34 ఓట్లు, సీ అనే అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయనుకోండి. పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ రాలేదు. కాబట్టి వీరిలో ఎవరినీ విజేతగా ప్రకటించరు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు.

అతి తక్కువగా ఓట్లు పోలైన సీ అనే అభ్యర్థిని ఎలిమినేట్‌ చేసి, అతని ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికిచ్చారనే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రెండో ప్రాధాన్యంలో ‘ఏ’అనే అభ్యర్థికి 2 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 18 ఓట్లు వచ్చాయనుకోండి. మొత్తం ‘ఏ’అనే అభ్యర్థికి 46+2=48 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 34+18=52 ఓట్లు వచ్చినట్టు లెక్క. దీంతో బీ అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. గెలుపులో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. 

సెలవులు కలిసొచ్చేనా..!
పట్టణ ఓటర్లు ఓటు వేయాలంటే అంతగా ఆసక్తి చూపించరనేది ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కన్పించింది. మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ముందు వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చాయి. ఈ ప్రభావం పట్టణ ఓటర్లపై పడుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. 11న మహాశివరాత్రి, 12న ష మేరాజ్‌(ఆప్షనల్‌ హాలీ డే), 13న రెండో శనివారం, 14న ఆదివారం రావటం అభ్యర్థులకు టెన్షన్‌కు గురిచేస్తోంది.

పట్టణ ఓటర్లు సహజంగా వరుస సెలవులు వస్తే టూర్లకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు వరుస సెలవులతో ఇంటికి వచ్చి ఓటు వేస్తారనే మరో అంచనా కూడా లేకపోలేదు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్‌ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్న పట్టుభద్రులు వరుస సెలవులతో ఇంటికి వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటినుంచే వారితో ఆయా పార్టీల నాయకులు ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు.  

1,2,3.. నంబర్లే రాయాలి
రోమన్‌ అంకెలు రాస్తే ఓటు చెల్లదు. ఒకటి, రెండు అని తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో రాసినా, టిక్‌ చేసి న ఓటు చెల్లదు. బ్యాలెట్‌ పేపర్‌ మీద ఎటువంటి రాతలు రాసినా, సంతకం పెట్టినా ఓటు చెల్లదు. కేవలం 1,2,3 అని నంబర్లు మాత్రమే రాయాలి.  

చదవండి : (ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..)
(తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్‌ సీటే టార్గెట్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top