తండ్రి కోసం 3 ఆస్పత్రులు.. 12రోజులు.. రూ.13లక్షలు..

Private Hospitals Overcharging For COVID 19 Treatment In Rajanna Siricilla - Sakshi

సాక్షి, రాజన్నసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన అనంతుల రవీందర్‌ సుమారు 30ఏళ్లుగా స్థానిక పాత బస్టాండ్‌లో మెస్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు కొడుకులు. ఇంజినీరింగ్‌ పూర్తయిన కొడుకులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లిద్దరూ సెటిల్‌ అయితే ప్రశాంతంగా ఉందామనుకున్నాడు. ఉన్నట్టుండి సెకండ్‌ వేవ్‌లో రవీందర్‌ కరోనా బారినపడ్డాడు. ఎందుకైనా మంచిదని గత ఏప్రిల్‌ 4న అతడు కరోనా టీకా వేయించుకున్నాడు. ఒకట్రెండు రోజులు జ్వరం వస్తుందని నర్స్‌లు తెలిపారు.

తీవ్రజ్వరం.. కరోనా పాజిటివ్‌
టీకా వేసుకున్న మరుసటిరోజు రవీందర్‌ అస్వస్థతకు గురయ్యాడు. ఏప్రిల్‌ 8వ తేదీన జ్వరం వస్తే డోలో 650 టాబ్లెట్లు వేసుకున్నాడు. తగ్గకపోగా 9,10,11వ తేదీల్లో విపరీతంగా పెరిగింది. 12న ఉదయం జిల్లా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. మరుసటి రోజు పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆక్సిజన్‌ లెవెల్‌ 70కి పడిపోయింది. దీంతో మానసికంగా ఆందోళనకు గురయ్యాడు.

రూ.2వేలు ఇస్తానన్న దొరకని కారు 
అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు దాటింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేవని చెప్పడంతో స్నేహితుడి సలహాతో వేములవాడలోని ఆస్పత్రికి వెళ్లాలనుకున్నాడు రవీందర్‌. 12కి.మీ. దూరానికి రూ. 2వేలు కిరాయి చెల్లిస్తామన్నా కారు దొరకలేదు. ఎలాగోలా వేములవాడకు చేరుకున్నాడు. డాక్టర్లు స్పందించక పోవడంతో తిరిగి సిరిసిల్లకు వచ్చాడు. తెలిసిన డాక్టర్‌ను సంప్రదిస్తే.. కరీంనగర్‌లో తనకు తెలిసిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి  వెళ్లండని, తాను నేను ఫోన్‌ చేసి చెప్పా అని సలహా ఇచ్చాడు. రూ.25వేలు చేతిలో పట్టుకుని కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ కరీంనగర్‌ వెళ్తుండగా బావుపేటలో చెమటలు బాగా వచ్చాయి. ఓ ఐదు నిమిషాలు ఆగి.. మంచినీళ్లు తాగి సేద తీరాడు.

నాలుగురోజులు రూ.3లక్షలు
కరీంనగర్‌లోని బంధువు సాయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు రవీందర్‌. భయానికి పల్స్‌ రేటు కూడా పడిపోయింది. రూ.25వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరాడు. సిబ్బంది మాస్క్‌ వేసి గ్లూకోజ్‌ పెట్టారు. మరుసటిరోజు రెండు గ్లూకోజులు పెట్టారు. అయినా డాక్టర్‌ రాలేదు. పరీక్షించలేదు. ఈలోపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటిలేటర్‌ ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అప్పటికే నాలుగు రోజులైంది.  నామమాత్రపు చికిత్స చేసి మందులకని రూ.90వేలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు రూ.1.30లక్షలు, ఇతర ఖర్చుల కింద ఇంకో రూ. 60 వేలు.. మొత్తం సుమారు రూ. 3 లక్షలు వసూలు చేశారు ఆస్పత్రి నిర్వాహకులు.

మొత్తం రూ.13 లక్షలు
వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లగా ఒక్కరోజులోనే రూ.70వేలు వసూలు చేశారు. అయినా, అక్కడ ఆ సౌకర్యం లేదంటూ ఇంకో ఆస్పత్రికి పంపించారు. రోజూ రూ.50వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే వైద్యం అందుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. చేసేదిలేక దొరికిన చోటల్లా అప్పు చేసి బిల్లులు చెల్లించారు. ఐదు రోజులు చికిత్స చేసిన నిర్వాహకులు.. రూ.5లక్షలు బిల్లు వసూలు చేసి రవీందర్‌ను డిశ్చార్జ్‌ చేశారు. ఇంటికి వచ్చాక కూడా ఆక్సిజన్‌ సౌకర్యం ఉండాలని సూచించారు.

దీంతో ఇంట్లోనే ఆక్సిజన్‌తో చికిత్స కొనసాగింది. ప్రస్తుతం కోలుకున్నాడు. దాదాపు 12 రోజులు ఆస్పత్రిలో ఉండి తీరా ఇంటికి చేరే సరికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ.13 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. ఇందులో తండ్రి ప్రాణాలు కాపాడాలని కొడుకు తెలిసిన వాళ్లదగ్గర రూ.11లక్షలు అప్పుగా తెచ్చాడు. మంచి ఆహారం తీసుకుంటూ అతడు కోలుకున్నాడు. ప్రాణాపాయం తప్పింది కానీ చికిత్స కోసం చేసిన అప్పు ఎలా తీర్చేదని తల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాడు. 

బిల్లులు ఇప్పించాలె
కరోనా టీకా తీసుకున్నాక కూడా వైరస్‌ బారినపడడం దారుణంగా ఉంది. ఉన్నంతలో పనిచేసుకుని బతకడం అలవాటైన సమయంలో కరోనా కాటేస్తూ అప్పుల్లో ముంచింది.     చికిత్సల పేరుతో ఆస్పత్రుల నిర్వాహకులు రూ.లక్షల్లో గుంజుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆస్పత్రులను కట్టడి చేయాలె. నా బిల్లులు వాపసు ఇప్పించాలె. సామాన్యులను ఆదుకోవాలె. 

– అనంతుల రవీందర్, సిరిసిల్ల 

చదవండి: వన్‌.. టూ.. 'త్రీ'.. రెడీ!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top