కాటన్‌ మరిచారు.. కుట్లు వేశారు!

Pregnant Woman Doctors Leave Cotton Inside - Sakshi

వర్ధన్నపేట: ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణికి శస్త్రచికిత్స చేసి అందులోనే కాటన్‌ (దూది) మరిచి కుట్లు వేసి పంపించిన సంఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి శివారు బావనికుంట తండాకు చెందిన నూనావత్‌ దేవేందర్‌ భార్య సౌజన్య జూన్‌ 16న పురిటి నొప్పులతో బాధపడగా.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సాధారణ ప్రసవమైంది.

ఆస్పత్రికి తీసుకెళ్లగా తల్లీ, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, రక్తస్రావం అవుతుండటంతో చిన్న శస్త్రచికిత్స చేసి రెండు కుట్లు వేస్తే సరిపోతుందని కుట్లు వేశారు. ఆరోజు నుంచి సౌజన్య అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపు నొప్పి తోపాటు మంట తదితర సమస్యలతో బాధపడుతుండగా దేవేందర్‌ వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేసిన చోట లోపల కాటన్‌ మరిచి కుట్లు వేశారని తేల్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన దేవేందర్‌.. సౌజన్యను శుక్రవారం ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులను నిలదీశాడు. కుట్లు వేసినప్పుడు పొరపాటున కాటన్‌ మరిచి కుట్లు వేశామని, తమను క్షమించమని కోరారన్నారు. వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి కాటన్‌ను తొలగించి సౌజన్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top