క్రమబద్ధీకరణతో అడవుల ఆక్రమణకు అవకాశం 

Possibility Of Forest Encroachment With Regularization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ అటవీ ఆక్రమణలకు అవకాశం ఇవ్వొద్దని పర్యావరణ నిపుణులు, జంతు ప్రేమికులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. గతంలో చేసిన ఆక్రమణలను కొత్తగా క్రమబద్ధీకరిస్తామంటే అడ్డూ అదుపూ లేకుండా అటవీ విధ్వంసం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరిట గత ఏడేళ్లుగా చేపట్టిన బృహత్‌ కార్యక్రమం ద్వారా సాధించిన మంచి ఫలితాలు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో పోడు సమస్య అధ్యయనానికి, క్షేత్ర స్థాయి వాస్తవాల సేకరణను అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు చేపడుతున్నారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. 

సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవాలి.. 
మొత్తంగా అటవీ ఆక్రమణలను పోడుగా పరిగణించకుండా, అటవీ భూమిని సాగుచేసే నిజమైన ఆదివాసీ గిరిజనులను గుర్తించాలి. ఏళ్లకొద్దీ సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం మంచిదే. అయితే ఈ దిశలో సర్కారు తీసుకునే నిర్ణయాలు అటవీ హక్కులు, అటవీ పరిరక్షణ చట్టాలు, భారత అటవీ చట్టం వంటి చట్టపరమైన సమీక్షకు నిలబడలేవు. అదీగాక పోడును క్రమబద్ధీకరిస్తామనే ప్రభుత్వ సంకేతాలతో అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తే వాటిపై ఎప్పటికైనా హక్కులు లభించొచ్చుననే దురాశతో ఇబ్బందులు తలెత్తుతాయి. హరితహారం పేరిట సాధించిన ఫలితాలు, ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.  
– ఇమ్రాన్‌ సిద్దిఖీ, జంతు ప్రేమికుడు, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ  

పోడు పేరిట విధ్వంసం.. 
ఆదివాసీలు, గిరిజన జనాభా లేని చోట్ల కూడా ఆదివాసీ చట్టాన్ని అమలు చేస్తామనడం సరికాదు. అడవిని విధ్వంసం చేసి గిరిజనేతరులకు కూడా పునరావాసం కల్పించాలనేది కూడా మంచిది కాదు. 2006లో కేంద్రం సవరించిన అటవీహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం.. పోడు, అటవీ ఆధారిత గిరిజన , ఆదివాసీలకు మాత్రమే మెరుగైన జీవితం కోసం కొంత పోడు చేసిన అటవీ ప్రాంతం విధ్వంసానికి గురికాకుండా చేయాలి. అందువల్ల పోడు అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించడం సరికాదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. అటవీ చట్టమనేది పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ను డీరిజర్వ్‌ చేయడానికి కూడా రాష్ట్రానికి అధికారం లేదు. 15 ఏళ్ల సుదీర్ఘకాలం దాటాక కూడా (2006లో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక) పునర్‌ సమీక్షించి, 2000 చట్టాన్ని అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు. వాస్తవానికి ఇప్పటిదాకా ఎంత మంది గిరిపుత్రుల కుటుంబాలకు ఎన్ని లక్షల ఎకరాల్లో పోడు పట్టాలిచ్చారు. పోడు పేరిట సహజసిద్ధమైన అటవీ వనరులకు నష్టం చేసే ప్రయత్నాలు కూడా చేయకూడదు.  
– పోట్లపల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త, న్యాయవాది

గిరిపుత్రులకు నిజమైన లబ్ధి చేకూరుతోందా? 
అడవుల పరిరక్షణ, అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాల విషయంలో ప్రభుత్వం, పౌరసమాజం తాము అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులను సమీక్షించుకోవాలి. అభివృద్ధి పేరిట అడవులకు, పోడుభూముల పేరిట ఆదివాసీ, గిరిపుత్రులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నామనేది ఆత్మపరీక్ష చేసుకోవాలి. పోడు చేసుకునే వారికి పట్టాల అందజేతకు మళ్లీ కొత్తగా అవకాశాలిస్తామంటే ఈ నెపంతో జరిగే విధ్వంసం ఇక్కడితో ఆగదు. దీనివల్ల మళ్లీ కొత్తగా పోడు కొట్టే ప్రమాదం ఉంది. రాజకీయ నేతల అండదండలున్న వారికి, గిరిజనేతరులకే ఈ ప్రయోజనాలు దక్కుతాయి
– సరస్వతి రావుల, పర్యావరణవేత్త, నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఏపీఎం) పూర్వ కన్వీనర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top