ఆ ఒక్కటీ అడక్కు | Political representation by caste and sub-caste | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటీ అడక్కు

May 4 2026 2:40 AM | Updated on May 4 2026 2:40 AM

Political representation by caste and sub-caste

కులాలు, ఉపకులాల వారీ రాజకీయ ప్రాతినిధ్యం

వివరాలు సర్వే నివేదికలో పొందుపరచకుండా గోప్యత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదికను 4 సంపుటాలుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనాభా దామాషా ప్రకారం సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తోందా? అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయిన కులాలు ఏవి? వంటి కీలక అంశాలు ఇందులో బహిర్గతమవుతాయని చాలామంది ఎదురు చూశారు. సర్వే ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సైతం పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలను ఈ నివేదికలో పొందు పరిచిన ప్రభుత్వం కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

56 రకాల ప్రశ్నలకు సమాచారం సేకరించినా.. 
సర్వేలో భాగంగా 56 రకాల ప్రశ్నలకు సమాధానాలను ప్రభుత్వం ప్రజల నుంచి సేకరించింది. రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభా సర్వేలో పాల్గొని ప్రభుత్వం కోరిన వివరాలను అందించింది. మొత్తం 242 కులాలు, ఉపకులాల వారితో పాటు ఏ కులానికి చెందనివారు కూడా వీరిలో ఉన్నారు. దాదాపుగా 4 శాతం మంది తాము ఏ కులానికి చెందని వారిగా పేర్కొనగా, మిగిలిన వారు తమ కులం, ఉపకులం వివరాలు ఇచ్చారు.  

– 46వ ప్రశ్న కింద కుటుంబంలోని వ్యక్తుల రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కుటుంబంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసినవారు ఉన్నారా? ప్రస్తుతం/గతంలో ప్రజాప్రతినిధిగా సభ్యత్వం పొందారా? ప్రస్తుతం/గతంలో మంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, తదితర ఆఫీస్‌ బేరర్‌ పదవుల్లో పనిచేశారా? ఎన్ని దఫాలు పనిచేశారు? ప్రజాప్రతినిధిగా మొత్తం ఎన్నేళ్లు పనిచేశారు? వంటి వివరాలను నమోదు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే 242 కులాలు, ఉప కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం కలిగి ఉన్న కులాలు, ఉప కులాలు ఏవి? వాటి జనాభాతో పోల్చితే ప్రాతినిధ్య నిష్పత్తి ఎంత? ఏ కులాలు, ఉప కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి? వంటి అంశాలపై స్పష్టత వచ్చేది. ప్రధానంగా రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప కులాలు ఏవో తెలిసిపోయేది.  

– నివేదిక రెండో సంపుటిలో రాజకీయ ప్రాతినిధ్యంపై సంక్షిప్త సమాచారాన్ని మాత్రం పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రామ, మండల స్థాయి ఎన్నికలు, బహిరంగ సభలు, ఫిర్యాదుల వేదికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల స్థాయి కమిటీలు, కుల సంఘాలు, సంక్షేమ కమిటీలు, కుల సంఘాలు వంటి రాజకీయ కార్యకలాపాల్లో ఈ వర్గాలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంత రాజకీయాల్లో మాత్రం ఓసీలు, ఓబీసీల్లోని ఉన్నతవర్గాలు పట్టణ స్థానిక సంస్థలతో పాటు పార్టీ నాయకత్వ పదవుల్లో అధిక ఉనికి కలిగి ఉన్నాయని పేర్కొంది.  

ఆ సమాచారం ఉపయోగించలేదు? 
కులాలు, ఉప కులాల వారీగా రాజకీయ నేపథ్యానికి సంబంధించి సర్వేలో సేకరించిన సమాచారాన్ని నివేదిక తయారీలో వినియోగించలేదని ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సర్వేలో ఇందుకు సంబంధించిన సరైన సమాచారం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఎన్యూమరేషన్‌ ఫారంలో అడిగిన ప్రశ్నలు కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి సరిపోలేదని స్పష్టం చేశారు. అయితే అస్పష్టత, గందరగోళాన్ని నివారించడానికే ఈ గణాంకాలను నివేదికలో బహిర్గతం పర్చలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వే నివేదిక తయారీలో పాల్గొన్న స్వతంత్ర నిపుణుల బృందంలోని సభ్యుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా కులాల వారీ రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవచ్చని, ఉప కులాల ప్రాతినిధ్యం తెలుసుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాజకీయ పారీ్టలే తమ పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ఉపకులాల వారీగా ఇస్తున్న ప్రాతినిధ్యాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement