Mephentermine Sulphate Injection Illegal Seller Arrested In Hyderabad - Sakshi
Sakshi News home page

కండల కోసం ఆరోగ్యం పణం!.. జిమ్‌కు వెళ్లే వారే ఎక్కువ

Jan 4 2022 6:35 AM | Updated on Jan 4 2022 9:21 AM

Police Arrest Two People Over Improper Use Mephentermine Sulphate Injection - Sakshi

స్వాధీనం చేసుకున్న మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లు 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను నగర యువత తక్కువ కాలంలో కండలు పెంచడానికి వినియోగిస్తోంది. జిమ్‌లలో ఎక్కువ సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ సూది మందు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. ఈ ఇంజెక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.5.6 లక్షలు విలువైన 280 మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి సోమవారం వెల్లడించారు.

చంద్రాయణగుట్టకు చెందిన షేక్‌ అక్రమ్, మహ్మద్‌ యహ్యా స్నేహితులు. యహ్యాకు ఫార్మా రంగంతో పరిచయం ఉండటంతో పాటు ఓ ఆసుపత్రిలోని మెడికల్‌ షాపులో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ రకాలైన ఔషధాలు, వాటిలో స్టెరాయిడ్స్‌గా ఉపకరించే వాటిపై పట్టుంది. ఇతడికి మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీన్ని యువత ఎక్కువగా వాడతారని తెలిసింది. రోగులకు సర్జరీలు చేసే సమయంలో మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పని చేయడానికి ఉపకరిస్తుంది.

అలాగే గుండెపోటు వచ్చిన వారికీ వైద్యం కోసం ఈ ఇంజెక్షన్‌ వాడతారు. ఈ ఇంజెక్షన్‌ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తిస్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు. దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పే ఆస్కారం ఉంటుంది. అయితే కాలక్రమంగా ఈ ఇంజెక్షన్‌ను అథ్లెట్స్‌ స్టెరాయిడ్‌గా వాడటం మొదలెట్టారు.  

జిమ్‌కు వెళ్లే వారే ఎక్కువ.. 
నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్‌ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీలేనిదే ఈ ఇంజెక్షన్‌ అమ్మడానికి వీలులేదు. అయితే కొందరు అక్రమార్కులు వీటిని జిమ్‌లకు వెళ్ళే యువతకు అక్రమంగా, ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన యహ్యా... అక్రమ్‌తో కలిసి వీటిని దందా చేయడం మొదలెట్టారు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో ఈ ఇంజెక్షన్లు ఖరీదు చేస్తున్నారు.

అక్కడ నుంచి కొరియర్‌లో సిటీకి రప్పించిన జిమ్‌లకు వెళ్లే యువతకు విక్రయిస్తున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ ఎమ్మార్పీ రూ.300 ఉండగా..వీళ్లు రూ.2 వేల వరకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్‌ థక్రుద్దీన్, ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్, కె.చంద్రమోహన్, ఆర్‌.ప్రతాప్‌రెడ్డిలతో కూడిన బృందం దాడి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి 280 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. మెఫన్‌టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీన్ని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమం అని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement