
11న కూడా ఎంపీలు, ముఖ్యనేతలతో చర్చలు
పాల్గొననున్న అమిత్ షా, జేపీ నడ్డా
తెలంగాణలో అధికార సాధన వ్యూహంపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ ‘యాక్షన్ ప్లాన్’ను ఖరారు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీకి ముందే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ వరుస భేటీలతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.
అధికార సాధనే లక్ష్యంగా వ్యూహరచన
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైనా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా 8 సీట్లు గెలుచుకోవడం, అనంతరం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని గెలుచుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, కార్యవర్గ కూర్పుపై సందిగ్ధత, అసంతృప్తులు, సమన్వయ లేమి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరటంతో దీనిని అవకాశంగా మార్చుకోవాలని ఇప్పటికే ముఖ్య నేతలు ఉద్బోధ చేసినట్టు సమాచారం. అంతర్గత, బహిర్గత సమస్యలతో బీఆర్‌ఎస్ బలహీనపడటంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే మంచి తరుణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని రాష్ట్ర పార్టీకి నాయకత్వం నిర్దేశించినట్టు సమాచారం.
ఇప్పటికే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే పనిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లను అధిక సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.