Photo Feature: ట్రాఫిక్‌ తిప్పలు.. చిన్నారుల సాహసం

Photo Feature in Telugu: Clouds Tirumala, Sugarcane Farmers, Zaheerabad - Sakshi

ఆ ఊరి పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. 


జహీరాబాద్‌లోని ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌లో చెరకు క్రషింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్‌ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్‌ చౌక్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్‌ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. 


బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్‌లోని విజయనగర్‌ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్‌ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు.  – కోహెడరూరల్‌ (హుస్నాబాద్‌) 


హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్‌పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిన దృశ్యం ఇది. 


దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్‌పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు.


కార్డెలియా క్రూయిజ్‌ షిప్‌లో ముంబై నుంచి లక్షద్వీప్‌కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్‌లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు.


మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్‌ రద్దీ.


భారత్‌లో అత్యంత పురాతనమైన చేరమాన్‌ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు.


సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఉన్న వాసాయ్‌ బీచ్‌లో బుధవారం కనిపించింది.


తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top