Hyderabad: పట్టెడన్నం కోసం. .ప్రాణాలే పణంగా!.. ఒక్క ఏడాదిలోనే 17 మంది మృతి

People Que Life Risk For Food At Basavatarakam Cancer Hospital - Sakshi

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి చౌరస్తాతోపాటు ఆ ప్రాంత రహదారులు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇక్కడ నిత్యకృత్యం కాగా మృతుల కుటుంబాలు సైతం ఆగమవుతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు నిత్యం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్దకు ఆహార పదార్థాలను తీసుకొస్తుంటాయి. ఆకలి తీర్చుకునేందుకు ఆతృతతో రోడ్డు దాటేందుకు యత్నిస్తున్న రోగుల బంధువులు, యాచకులను అవతలి వైపు నుంచి వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు మృత్యువాతా పడుతున్నారు. ఇలా గత ఏడాది ఇక్కడ రోడ్డు ప్రమాదాల బారిన పడి 17 మంది అమాయకులు మరణించడం అందరి హృదయాలను కలచివేసే అంశం. మరో వంద మంది వరకు పలు ప్రమాదాల్లో గాయపడి మంచానపడ్డారు.

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సగటున రోజుకొకటి చొప్పున రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల నుంచి వస్తున్న రోగుల సహాయకులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 


ప్రమాదకరంగా వాహనాల మధ్య రోడ్డు దాటుతున్న రోగుల బంధువులుసూచికలేవి? 
►బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద రోజూ 20 నుంచి 30 మంది వరకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నదానం చేస్తుంటారు. ప్రముఖుల పుట్టిన రోజులు, వర్ధంతుల సందర్భంలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.  
►ఓ సంస్థ అయితే  ఇక్కడ రోజూ అన్నదానం చేస్తుంది.  
►ఆయా సందర్భాల్లో సుమారు 300 మంది వరకు యాచకులు, 200 మంది వరకు రోగుల సహాయకులు ఆహార పదార్థాలను స్వీకరిస్తుంటారు. అన్నదానం చేసేందుకు వచ్చిన వాహనాల వద్దకు ఆకలితో ఉన్న అభాగ్యులు రోడ్డుపై వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా పరుగులు తీస్తుంటారు. దీంతో వారు ప్రమాదాల బారిన.. ఒక్కోసారి మృత్యువాతా పడుతున్నారు. 

ఆహారం పంపిణీ చేస్తున్న ప్రాంతంలో పరిస్థితి ఇలా... 

►తెలంగాణ భవన్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మలుపు వద్ద రోడ్డు దాటే వారిని ఢీకొడుతున్నారు.
►నందినగర్‌ వైపు నుంచి కేబీఆర్‌ పార్కు వైపు బస్‌ స్టాప్‌లకు వరద నీరు వెళ్లేందుకు సెంట్రల్‌ మీడియన్‌ను తవ్వారు. ఈ గోతిలో నుంచే చాలా మంది అటూ ఇటు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.  
► దీనికి తోడు స్టడీ సర్కిల్‌ ఎదుట యూటర్న్‌ ఉందనే విషయం సిగ్నళ్ల ద్వారా తెలపాల్సి ఉంది. ఎలాంటి సిగ్నల్‌ ఏర్పాటు చేయలేదు.  

►ఇక్కడ సిగ్నల్‌ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు దాటే వారిని అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అయితే అలాంటివి ఏమీ ఉండవు. 
సమన్వయమేది? 
►ప్రమాదకరంగా ఉన్న బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద ఇష్టమొచి్చనట్లుగా రోడ్డు దాటడం, సెంట్రల్‌ మీడియన్‌లో ప్రమాదకరంగా రాకపోకలు సాగేలా సందులు ఏర్పాటు చేయడం, సెంట్రల్‌ మీడియన్‌లోని పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

►జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ఈ రెండు విభాగాలు సమన్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
►బంజారాహిల్స్‌ పోలీసులు ఎన్నోసార్లు జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఇక్కడ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top