సిగాచీ.. బాధితులకు దిక్కేది? | One Year for Sigachi Factory Blast | Sakshi
Sakshi News home page

సిగాచీ.. బాధితులకు దిక్కేది?

Jun 30 2026 4:15 AM | Updated on Jun 30 2026 4:15 AM

One Year for Sigachi Factory Blast

అగ్నిప్రమాద ఘటనకు నేటితో ఏడాది 

పూర్తి స్థాయిలో అందని పరిహారం.. నెరవేరని సీఎం హామీ 

రూ.54 కోట్లు ఇవ్వాల్సి ఉండగా..ఇప్పటివరకు రూ.24.51 కోట్లు మాత్రమే చెల్లింపు 

ఇంకా కోలుకోని క్షతగాత్రులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ అగ్నిప్రమాద ఘటనకు నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాది పూర్తవుతున్నా ఈ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమలో 2025 జూన్‌ 30న జరిగిన ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది కాలి బూడిదైన విషయం విదితమే. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నిరుపేద కార్మికులే కావడం గమనార్హం.  

నెలల తరబడి జాప్యం 
54 మంది బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేవలం రూ.24.51 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి సగటున రూ.45 లక్షల మేరకే పరిహారం అందింది. మిగిలిన రూ. 55 లక్షల పరిహారాన్ని చెల్లించడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం బాధిత కుటుంబాల తరపున రాష్ట్ర ఉన్నత న్యాయస్థాయంలో పిల్‌ కూడా దాఖలైంది. బాధిత కుటుంబాలు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేయడంతోపాటు కలెక్టరేట్‌ ఎదుట నిరసన కూడా తెలిపారు. 

మరోవైపు ఈ ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏడాది కాలంగా ఇంటివద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. అయినా వారు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతున్నారు. కాలిన గాయాలు కొంత మేరకు మానినా.. తమ సొంత పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారిందని, పనులు చేసుకునేందుకు శరీరం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. 

పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను పరిహారం కింద చూపుతున్నారు 
సిగాచీ ప్రమాదంలో నా భర్త బాలకృష్ణ మృతి చెందారు. ఇస్తామన్న పరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. నా భర్త పొదుపు చేసుకున్న ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులను కూడా నష్ట పరిహారం కింద చూపుతున్నారు. ఇద్దరు పిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. వెంటనే ఇస్తామన్న రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలి.     – మల్లేశ్వరి, ముత్తంగి.

వెంటనే చెల్లించాలి 
సిగాచీ ప్రమాదం మా కుటుంబాన్ని కష్టాల పాలు జేసింది. ఈ ప్రమాదంలో నా భర్త వీ.ఆర్‌.జీ. నాగేశ్వర్‌రావు మరణించారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పరిహారం రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. మిగిలిన పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. –హేమలత, పటాన్‌చెరు

ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను 
అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను. కాళ్లు, చేతులకు అయిన గాయాలతో పనిచేయలేకపోతున్నాను. సొంత పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇస్తామన్న హామీ మేరకు పరిహారం చెల్లించడంతోపాటు పూర్తి స్థాయి లో చికిత్స చేయించి ఆదుకోవాలి.  – రాజేశ్‌కుమార్‌ చౌదరి, క్షతగాత్రుడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement