గంట ముందే సెంటర్‌కు.. | NEET 2026 exam is being held nationwide on May 3 | Sakshi
Sakshi News home page

గంట ముందే సెంటర్‌కు..

May 3 2026 5:45 AM | Updated on May 3 2026 5:45 AM

NEET 2026 exam is being held nationwide on May 3

దేశవ్యాప్తంగా నేడు నీట్‌ పరీక్ష

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు నిర్వహణ 

ఫుల్‌ షర్టు, షూస్,  హైహీల్స్‌ నిషేధం 

రాష్ట్రం నుంచి 73 వేల మంది హాజరయ్యే అవకాశం 

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌–యూజీ) ఆదివారం జరగనుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్‌–పేపర్‌ విధానం ద్వారా జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.

రాష్ట్రంలో 73 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌ వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్‌ హాజరు నమోదు వంటి విధానాలు అమలు చేస్తున్నారు. 

ఎల్రక్టానిక్‌ పరికరాలు నిషేధం: నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్‌టీఏ విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష రాసేందుకు వచ్చేటప్పుడు అడ్మిట్‌ కార్డ్, ఫొటో ఐడీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందే హాజరు కావాలి. మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం. ఫుల్‌హ్యాండ్స్‌ దుస్తులు, షూస్‌ ధరించరాదు.

ట్రాన్స్‌పరెంట్‌ పెన్‌ మాత్రమే అనుమతిస్తారు. మెటల్‌ వస్తువులు, ఆభరణాలు నిషేధం. ఇక అమ్మాయిలు హెయిర్‌పిన్‌లు, క్లిప్‌లు, మెటల్‌ రబ్బర్‌ బ్యాండ్లు ధరించి వస్తే అనుమతించరు. పెద్ద చెవిపోగులు, గొలుసులు, బంగారు ఆభరణాలు ధరించరాదు. హైహీల్స్, అలంకరణలున్న షూస్‌ నిషేధం. సాధారణ చెప్పులు/శాండల్స్‌ మాత్రమే ధరించాలి. ముసుగు లేదా సంప్రదాయ దుస్తులు ధరించే వారు ముందుగా రిపోర్ట్‌ చేయాలి. అదనపు తనిఖీ జరుగుతుంది. మేకప్‌ పరిమితంగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులు తీసుకురావొద్దు.  

పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు 
వేసవి కాలం కావడంతో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. నీట్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, విజిలెన్స్‌ బృందాలు పనిచేస్తున్నాయి. సెంటర్ల వద్ద పోలీస్‌ బందోబస్తు కూడా ఉంటుంది. పరీక్షను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement