సింగిల్‌ డిజిట్‌ శిక్షలేనా ? | Minister Jupally series of questions during the Excise Enforcement review | Sakshi
Sakshi News home page

సింగిల్‌ డిజిట్‌ శిక్షలేనా ?

Sep 14 2025 4:18 AM | Updated on Sep 14 2025 4:18 AM

Minister Jupally series of questions during the Excise Enforcement review

కేసులు నమోదు చేస్తున్నా.. శిక్షల శాతం ఎందుకు పెరగడం లేదు? 

ఒక లైసెన్సు తీసుకొని మూడు బార్లు నడిపిస్తుంటే మీ నిఘా ఏమైనట్టు? 

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమీక్షలో మంత్రి జూపల్లి ప్రశ్నల పరంపర 

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో సరిపెట్టి నీళ్లు నమిలిన యంత్రాంగం 

కింగ్‌పిన్‌లను గుర్తించి పీడీ చట్టం పెట్టండి 

అవసరమైతే ఆయుధాలిస్తాం... ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రతిరోజూ అక్కడో ఇక్కడో దాడి చేసి అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ, మరి ఈ కేసుల్లో నిందితులకు శిక్షలెందుకు పడడం లేదు ? శిక్షలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమా? శిక్షల శాతం గతం కంటే ఎందుకు పెరగడం లేదు’అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు.

‘మహారాష్ట్ర పోలీసులు ఇక్కడకు వచ్చి డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించేంతవరకు సమాచారం మీకెందుకు రాలేదు? మీ నిఘా ఏం చేస్తున్నట్టు? ఒక్క బార్‌షాప్‌ కోసం లైసెన్స్‌ తీసుకొని అదే లైసెన్స్‌ మీద రెండు, మూడు బార్లు నడిపిస్తుంటే మీ నిఘా ఏమైంది? వైన్‌షాపులు, బార్లపై నిఘా ఎందుకు తగ్గిపోయింది’అని ఆయన నిలదీశారు. శనివారం నాంపల్లిలోని తెలంగాణ ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్‌ అధికారుల పనితీరుపై మంత్రి సమీక్షించారు.

అక్రమ, కల్తీ మద్యం, కల్లు, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (ఎన్‌డీపీఎల్‌), డ్రగ్స్‌ ముడిసరుకు తయారీ, కేసుల పురోగతి, శిక్షల నిష్పత్తి, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యకలాపాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించిన యంత్రాంగం మంత్రి అడిగిన ప్రశ్నలకు మాత్రం నీళ్లు నమిలినట్టు తెలిసింది. 

అవసరమైతే ఆబ్కారీ పోలీసులకు కూడా డెడికేటెడ్‌ ఆయుధాలను ఇస్తామని, అక్రమ మద్యం వ్యవహారాలు, గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి జూపల్లి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమల్లో ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  

మనమెందుకు బ్రాండింగ్‌ చేయకూడదు? 
‘గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్‌లో మహువా (ఇప్పసారా)ను బ్రాండింగ్‌ చేసి అమ్ముతారు. మన రాష్ట్రంలో కూడా ఈత, తాటి కల్లును బాట్లింగ్‌ చేసి విక్రయిస్తే గీత కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. కల్తీ కల్లు నివారించొచ్చు. రాష్ట్రంలో టాడీ నేచురల్‌ బ్రూవరీ ఏర్పాటుపై అధ్యయనం చేయండి. 

నివేదిక ఇస్తే సీఎంతో మాట్లాడతా.’అని మంత్రి జూపల్లి చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో భాగంగా స్వాదీనం చేసుకున్న నల్లబెల్లాన్ని వృథాగా పారబోయకుండా రైతులకు విక్రయించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి జూపల్లి సూచించారు. ఎన్‌డీపీఎల్‌ మద్యాన్ని కూడా ధ్వంసం చేయకుండా, నాణ్యతను పరీక్షించి తిరిగి విక్రయించేందుకు గల అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు.  

సమన్వయం ముఖ్యం 
చర్లపల్లిలోని రసాయనిక పరిశ్రమలో డ్రగ్స్‌కు అవసరమైన రసాయనాలు తయారు చేస్తుంటే ఎందుకు నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. నేరాల నియంత్రణకు ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం ముఖ్యమని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో కింగ్‌పిన్‌లను గుర్తించి వారిపై పీడీ యాక్టులను నమోదు చేయాలని, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న డ్రగ్స్, సింథటిక్‌ డ్రగ్స్‌ వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. 

ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్‌ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం, అదనపు కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేïÙలతో పాటు అన్ని జిల్లాల 
అధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement