విచారణకు కమిటీ

Minister Etela order for inquiry over high prices in hospitals - Sakshi

మంత్రి ఈటల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ అంశంపై శనివారం ఆయన బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు నిర్ణయించినా.. మందులు, పీపీఈ కిట్లు, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్‌ ఆస్పత్రులు లాభాల కోసం మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమవంతు బాధ్యత పోషించాలని కోరారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదన్నారు. సాధారణ పరిస్థితి కంటే పది రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఫీజుల వసూలు, పడకల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించడం చేయాలని ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

పడకలు లేవని, కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేయడం, మూడు నాలుగు లక్షల అడ్వాన్స్‌ ఇవ్వనిదే చేర్చుకోకపోవడం, రోజుకి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా బిల్లులు వసూలు చేయడం, రోగి మృతి చెందినా కూడా చార్జీలు చెల్లిస్తే తప్ప మృతదేహం అప్పగించబోమని అనడంపై మండిపడ్డారు. ఏ మాత్రం కూడా లక్షణాలు లేని వారిని కూడా అడ్మిట్‌ చేసుకుని విపరీతంగా చార్జీలు వసూలు చేయడం తగదన్నారు. రోగి సీరియస్‌ కాగానే అంబులెన్స్‌లో పడవేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపైనా ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి వైద్య, ఆరోగ్య శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు. ప్రజలు కరోనా గురించి భయపడకుండా ప్రభుత్వాస్పత్రిలో చేరి ఉచితంగా వైద్యం చేయించుకోవాలని కోరారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవలందించడానికి, కరోనాను జయించడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఉన్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే, మెడికల్‌ కాలేజీల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. నగరం నలుమూలలా ఉన్న మల్లారెడ్డి, మమత, ఆర్వీఎం, ఎంఎన్‌ఆర్, అపోలో, కామినేని మెడికల్‌ కాలేజీలలో పాజిటివ్‌ పేషంట్లకు పూర్తిస్థాయి వైద్యం అందేలా చూడాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top