
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్లింది. దీంతో, పలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది.
👉నల్లగొండ జిల్లాలో మార్వాడీ వ్యాపారస్తులకు నిరసనగా మిర్యాలగూడలో వ్యాపారస్తుల బంద్. దుకాణ సముదాయాలు బంద్ చేసి నిరసన తెలిపిన స్థానిక వ్యాపారులు.
👉యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్, ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రాల్లో స్వచ్ఛంద బంద్‌లో పాల్గొంటున్న వర్తక వ్యాపారులు. బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్న వ్యాపారస్తులు. మార్వాడీ గోబ్యాక్ అంటూ చౌటుప్పల్‌లో వాణిజ్య సముదాయాలు బంద్ చేసి మద్దతు తెలుపుతున్న వ్యాపారస్తులు.
👉మార్వాడీ గో బ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ ఆగస్టు 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పిలుపు మేరకు పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో భారీగా మోహరించాయి పోలీసు బలగాలు.
👉జమ్మికుంట పట్టణంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. బంద్ సందర్భంగా పలువురు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉సిద్దిపేట జిల్లాలో మార్వాడీ గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జేఏసీ నాయకుల పిలుపు మేరకు విద్యా సంస్థలు, దుబ్బాక బంద్ కొనసాగుతోంది.
👉రంగారెడ్డి జిల్లా అమనగల్‌లో మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపునకు మద్దతుగా కిరాణా, వర్తక, వస్త్ర, స్వర్ణకార్ల షాప్‌లు బందు పాటిస్తున్నారు.
👉ఇక, తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని.. ఎదగనీయటం లేదని.. మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. పట్టణాల్లో షాపులను బంద్ చేస్తున్నారు. బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు.
👉ఓయూ జేఏసీ పిలుపుతో షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్వాడీ గో బ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మార్వాడీలకు బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు.