
ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయాం
ప్రతికూలతను అధిగమించి పార్టీ శ్రేణులు ముందుకు సాగాలి
21వ వార్షికోత్సవాలను నిర్వహించాలి
లేఖ విడుదల చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ కారణంగా ఏడాది కాలంలో క్షేత్రస్థాయి నుంచి అగ్రనాయకుల వరకు మొత్తంగా 366 మంది విప్లవకారులు మృతి చెందినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ వెల్లడించింది. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ (మావోయిస్టు) 21వ వార్షికోత్సవాలను నిర్వహించుకోవాలంటూ పార్టీ శ్రేణులకు నాయకత్వం ఈ నెల 6న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది.
చనిపోయిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 మంది జిల్లా కమిటీ సభ్యులు, 86 మంది ఏరియా కమిటీ /ప్లాటూన్ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు 152 మంది, స్థానిక నిర్మాణాల సభ్యులు 38 మంది ఉన్నారని అందులో వెల్లడించారు.
అలాగే మృతిచెందిన వారిలో వివరాలు తెలియని వారు మరో 43 మంది వరకు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ స్థాయిలో సభ్యులను కోల్పోవడం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అయితే దీనిని అధిగమించి ముందుకు సాగాలని కేడర్‌కు ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది.
అందువల్లే పార్టీకి నష్టాలు..
కేంద్ర కమిటీ రూపొందించిన ఎత్తుగడలను, గెరిల్లా యుద్ధ నియమాలను సరిగా అమలు చేయకపోవడం వల్లనే ఆపరేషన్ కగార్ కారణంగా ఎక్కువగా నష్టపోయినట్టు నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్యక్షేత్రాన్ని చిన్న ప్రాంతాలకే పరిమితం చేయకుండా విశాల భూభాగాలకు మార్చాలని, కేంద్రీకృత పద్ధతిలో కాకుండా వికేంద్రీకృత పద్ధతిలో పని చేయాలని కేడర్‌కు సూచించింది. చట్టబద్ధ, చట్ట వ్యతిరేక, రహస్య – బహిరంగ పోరాటాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొంది. పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలలో ప్రజలను విప్లవ ఉద్యమం వైపు సమీకరించాలని కోరింది.
మానసిక యుద్ధం
ఎదురు కాల్పుల్లో పోలీసుల వైపు కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని, కానీ వాటిని బయటకు వెల్లడించకుండా ప్రభుత్వం మానసిక యుద్ధం చేస్తోందని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. కర్రిగుట్టల దగ్గర చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 45 – 50 మంది జవాన్లు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని పేర్కొంది.
ఈ ఆపరేషన్ మొదలైన తర్వాత 16 రోజుల పాటు భద్రతా దళాలు అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయని, చివరకు తమ నుంచి పారిపోయి సరెండెర్ అయిన మాజీ మావోయిస్టును పట్టుకుని, అతడి సాయంతోనే ఆపరేషన్‌లో భద్రతా దళాలు ముందుకుసాగాయని పేర్కొంది. ఇతర ఆపరేషన్లలోనూ ఇలాంటి పరిస్థితే భద్రతా దళాలకు ఎదురైందని, అందుకే ప్రతీ గెరిల్లా సభ్యుడికి 30 నుంచి 100 మంది వంతున భద్రతా దళాలను మోహరిస్తున్నారని తెలిపింది.
శాంతి చర్చలకు సిద్ధం
ప్రజా ప్రయోజనాల రీత్యా శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ మరోసారి ప్రకటించింది. అయితే అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలని, ఉద్యమ ప్రాంతాల్లో సాయుధ బలగాల క్యాంపులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించింది.