ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ! | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ!

Published Wed, Aug 19 2020 9:06 AM

KTR Visit Warangal Flood Areas And COVID 19 Centers - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ / సాక్షి నెట్‌వర్క్‌: చారిత్రక ప్రాంతం, తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఓరుగల్లుపై ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎడతెరపి లేని వర్షం కారణంగా వరంగల్‌ మహా నగరాన్ని ముంచెత్తిన వరదలపై సీఎం చలించారని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని భావించినా కరోనా, ప్రొటోకాల్‌ సమస్యల కారణంగా తమను పంపారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో వరంగల్‌ను హైదరాబాద్‌ సరసన నిలబెడతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరుస వర్షాలతో ఓరుగల్లు వరదల్లో చిక్కుకోగా పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌..

జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు అధి కారులతో కలిసి మంగళవారం పర్యటించారు. నీట ముని గిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్‌ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. హైదరాబాద్‌ నుంచి మరో మంత్రి ఈటలతో కలిసి హె లికాప్టర్‌లో వచ్చిన కేటీఆర్‌ తొలుత వరంగల్‌ నగరాన్ని ఏరి యల్‌ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో దిగారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన నయీంనగర్, కేయూ 100 ఫీట్‌ రోడ్‌ మొదలైన వరద ముంపు ప్రాంతాల నుంచి పర్యటన ప్రారంభించారు. వర్షం కారణంగా నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత చర్యలు చేపడుతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినందున అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలోఒత్తిళ్లు ఉండవు
ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం భోజన విరామం తర్వాత కాజీపేటలోని నిట్‌ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంలో ప్రజలందరూ నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారని తెలిపారు. ప్రజలు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని, నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలు ఉన్నందున తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని, అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని, దసరా నాటికి అక్రమ నిర్మాణాలను తొలగించాలని సూచింయారు. ఇప్పటికే గుర్తించినవి కాకుండా వేరేచోట కూడా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించి, ఆక్రమణలు తొలగించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నామని, ఇందులో పోలీసు కమిషనర్‌ కో చైర్మన్‌గా, మున్సిపల్‌ కమిషనర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కమిషనర్‌ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని, వీరిద్దరిలో ఒకరు వారంలో ఒక రోజు వరంగల్లో పర్యటిస్తారని, నెలలోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

గోడు ఆలకిస్తూ...సహాయక చర్యలకు ఆదేశిస్తూ...
కేటీఆర్‌ నాయకత్వంలోని మంత్రుల బృందం నయీంనగర్, సమ్మయ్యనగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్డు, పోతననగర్, బొందివాగు రోడ్డు, రామన్నపేట, హంటర్‌ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. తొలుత నయీంనగర్‌ నాలాను సందర్శించిన సందర్భంగా స్థానికులతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడి సమస్యలు ఆరా తీశారు. మిగతా ప్రాంతాల్లోనూ ముంపు బాధితులతో మాట్లాడి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రెయినేజీలు, ఇండ్లు, రోడ్లను పరిశీలించడంతో పాటు ఫాతిమానగర్‌ – కేయూ వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్‌ ప్రాంత వాసులతో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకులు అంద చేస్తామని హామీ ఇచ్చారు. ఇక హంటర్‌ రోడ్డులో కేటీఆర్‌ సహా ఇతర ప్రజా ప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితిని పరిశీలించారు.

కరోనా బాధితులకు పరామర్శ
మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల బృందం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల రాజెందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పీపీఈ కిట్లు ధరించి కోవిడ్‌ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. కావాల్సిన మందులు, పరికరాలు, వైద్యులు సిద్ధంగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా సోకిన వారి దగ్గరికి రావడానికి సమీప బంధువులే జంకుతున్న సమయంలో కేటీఆర్‌ సహా మంత్రులంతా తెగువతో కోవిడ్‌ వార్డులోకి వచ్చి మాట్లాడడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement