Telangana: Ktr Gives Clarity on AP Govt Comments in Twitter, Details Inside - Sakshi
Sakshi News home page

KTR-AP Govt: నా వ్యాఖ్యల వెనుక​ ఎలాంటి దురుద్ధేశం లేదు: మంత్రి కేటీఆర్‌

Apr 30 2022 12:25 AM | Updated on Apr 30 2022 12:23 PM

Ktr Gives Clarity on AP Govt Comments in Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నా దగ్గరికి బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు వస్తుంటారు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం అం టారు. వారిని స్వాగతిస్తూనే.. మీరు ముందు ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లండి.. అక్కడి మౌలిక పరిస్థితులు, స్థానిక ఇబ్బందులను చూసి.. తిరిగి హైదరాబాద్‌కు రండి అని సూచిస్తాను. వారు అక్కడి వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూసి హైదరాబాద్‌కు తిరిగొచ్చి ఇతర నగరాల కంటే ఈ నగరమే బెటరని స్వయంగా చెబుతున్నారు..’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ప్రోపర్టీ షో శుక్రవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘పక్క రాష్ట్రంలో తోటలున్న ఓ స్నేహితుడు సంక్రాంతి పండు గకు సొంతూరు వెళ్లాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక నాకు ఫోన్‌ చేసి.. మీ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి ప్రజల్ని పక్క రాష్ట్రానికి పంపించండి అని చెప్పాడు. ఎందుకని నేను ప్రశ్నించా. మా ఊరిలో నాలుగు రోజులున్నా.. కరెంట్‌ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది.. అని నాతో చెప్పాడు. మన ప్రభుత్వం విలువ, అభివృద్ధి తెలి యాలంటే పక్క రాష్ట్రాలకు పంపించాలని ఆ స్నేహితుడు సూచించాడు’ అని కేటీఆర్‌ చెప్పారు. తాను చెప్పేది అతిశయోక్తిగా అనిపించినా లేదా డబ్బా కొడుతున్నానని అనుకుంటే మీరూ ఒక కారు వేసుకొని వెళ్లి చూసిరండని మంత్రి సూచించారు. 

లంచాలడిగే దుర్వ్యవస్థ మన దగ్గర లేదు
‘కొన్ని రాష్ట్రాల్లో మిలియన్‌ చదరపు అడుగు బిల్డింగ్‌ కట్టాలంటే చ.అడుగుకు ప్రభుత్వానికి ఇంత, ప్రతిపక్షానికి ఇంత అని లంచం ఇవ్వాలి. లేకపోతే పర్మిషన్‌ రాదు. ఇది వాస్తవం. కానీ లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకునే దుర్వ్యవస్థ మన దగ్గర ఉందా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. భవన అనుమతులు కానివ్వండి, పారిశ్రామిక పర్మిషన్‌ కానివ్వండి ఏదైనా సరే.. రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టినా, రూ.12 వేల కోట్లు పెట్టినా పైసా అడిగేటోళ్లు, ఇబ్బంది పెట్టేటోళ్లు మన రాష్ట్రంలో లేరని అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాలుగు రోజులు వ్యాపారం చేసొస్తే మన రాష్ట్రం విలువ, ఇక్కడి పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల గురించి తెలుస్తుందని చెప్పారు.
కేటీఆర్‌ వ్యాఖ్యల కలకలం: తెలంగాణకు వచ్చే పెట్టుబడిదారుల గురించి చెబుతూ..మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పలువురు ఏపీ మంత్రులు, నేతలు కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కేటీఆర్‌ ఒక ట్వీట్‌ చేశారు. ‘ఈ రోజు ఒక సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు బాధ కలిగించినట్టుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గారితో నేను సోదర సమాన అనుబంధాన్ని ఆస్వాదిస్తా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పురోగమించాలని కోరుకుంటున్నా..’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement