కిరాణా.. క్యాష్‌లెస్‌కే ఆదరణ!

Kirana Shop Owners Maintaining Cashless Transactions - Sakshi

పెద్ద నగరాల నుంచి గ్రామాల దాకా దుకాణాల్లో నగదు రహిత చెల్లింపులే... 

35 శాతం నుంచి 75 శాతం పెరిగిన ఈ తరహా లావాదేవీలు

కోవిడ్‌ విస్తృతికి అడ్డుకట్ట వేయడంలోనూ కీలకపాత్ర  

వాట్సాప్‌ ఆర్డర్లతో వినియోగదారుల ఇంటికే సరుకులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్న కిరాణా దుకాణాలు.. డిజిటల్‌ చెల్లింపుల బాటపట్టాయి. వినియోగదారుల కోసం నగదు రహిత (క్యాష్‌లెస్‌) చెల్లింపులను అందుబాటులో ఉంచుతున్నాయి. దేశ వ్యాప్తంగా కిరాణాల్లో లాక్‌డౌన్‌కు ముందు 35 శాతంగా ఉన్న డిజిటల్‌ చెల్లింపులు ఇప్పుడు రెండింతలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వంద మంది ప్రజానీకానికి ఒక దుకాణం అందుబాటులో ఉంది. లాక్‌డౌన్‌  సమయంలో  దూరపు ప్రయాణాలపై ఆంక్షలు, భౌతిక దూరం వంటి నిబంధనలతో సమీపంలోని చిన్న కిరాణాలపైనే కొనుగోలుదారులు అధికంగా ఆధారపడ్డారు. సూపర్‌ మార్కెట్లు, మార్ట్‌లకు వెళ్లేందుకు జంకడం, పెద్ద పెద్ద వరుసల్లో నిలుచొని సరుకుల కొనుగోళ్లకు ఆసక్తి చూపక దగ్గర్లోని కిరాణాలవైపే మొగ్గు చూపారు. అయితే అన్‌ లాక్‌ ప్రక్రియ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కిరాణా దుకాణాల బాటే పట్టారు. మెట్రో పట్టణాల్లో 50 శాతం, చిన్న పట్టణాల్లో 75 శాతం మంది పెద్దపెద్ద మార్కెట్లను కాదని కిరాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

వాట్సాప్‌లో ఆర్డర్లు... ఇంటికే సరుకులు... 
అయితే కొనుగోలుదారుల తాకిడి ఎక్కువ కావడంతో కిరాణా దుకాణ యజమానులకు వైరస్‌ సోకిన ఉదంతాలు అనేకం. దీన్ని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానంవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్‌ లావాదేవీలను గణనీయంగా పెంచారు. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు ఫోన్‌ పే, గూగుల్‌పే, పేటీఎం, క్యూర్‌ కోడ్‌ల ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ తరహా చెల్లింపులు కిరాణాల్లో గతంతో 35 శాతం ఉంటే ఇప్పుడు 75 శాతానికి పెరిగాయని బెంగళూర్‌కు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొన్ని నగరాల్లో కిరాణా దుకాణదారులు రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీల్లో నిత్యావసర సరుకుల ఆర్డర్లను మెసేజ్‌లు, వాట్సాప్‌ల ద్వారా తీసుకొని ఇంటికే పంపిణీ చేస్తున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం కాంటాక్ట్‌లెస్‌ డెలివరీలను అందించేందుకు వీలుగా వాట్సాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాయి.   

మా కిరాణా దుకాణానికి ప్రతిరోజూ 100 మంది కస్టమర్లు వస్తారు. లాక్‌డౌన్‌కు ముందు కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఫోన్‌ పేలో చెల్లించేవారు. ఇప్పుడు డెబిట్‌ కార్డు, గూగుల్‌పే, క్యూడర్‌ కోడ్‌ ద్వారా పేమెంట్స్‌ చేస్తున్నారు. కనీసం 80 మంది ఈ తరహా చెల్లింపులే చేస్తున్నారు.  – మధుసూదన్, కిరాణాదారు, మెదక్‌ 

పరిశుభ్ర వాతావరణం, ఇంటి పక్కనే ఉండటం, డిజిటల్‌ లావాదేవీలు చేస్తుండటం, ఎమ్మార్పీ ధరలకే విక్రయాలతో కిరాణా దుకాణాల్లోనే వస్తువులు కొనుగోలు చేస్తున్నా. సూపర్‌ మార్కెట్ల వైపు చూడటమే మరిచిపోయా. – రామ్మూర్తి, సంగారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top