ఆగమాగం..

Khammam People Suffering With Godavari Flood Water - Sakshi

వరదముంపులో వందల కుటుంబాలు

పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు

మేత దొరకక అల్లాడుతున్న పశువులు 

బూర్గంపాడు: ఒక పక్క కరోనా.. మరోవైపు గోదారి వరదలతో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించాలి. కానీ వరదముంపుతో ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళితే అక్కడ గుంపులుగా జనం. దీంతో భౌతిక దూరం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. వరదనీరు ఇళ్లలోకి చేరుతుండడంతో వందలాది మంది ఇళ్లు ఖాళీ చేసి పిల్లలు, వృద్ధులతో ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఒకేచోట చేరడంతో పునరావాస కేంద్రాల్లోనూ సరైన సౌకర్యాలు ఉండడం లేదు. దీనికి తోడు కరోనా భయంతో  కొంతమంది తమ ఇంటి దరిదాపుల్లోనే రోడ్లపై సామగ్రి పెట్టుకుని ఉంటున్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు మేత లేక అలమటిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే మేతకు వెళ్లిన పశువులు చేల వద్దే వరదలో చిక్కుకున్నాయి. 

గ్రామాల్లో అంధకారం..
వరదనీటితో పాటు పాములు, విషపురుగులు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో వరద బాధితులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామాల్లోకి వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్లు, సర్వీసు వైర్లు వరదనీటికి తాకి ప్రమాదం జరగకుండా ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రాత్రివేళల్లో గ్రామాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయి. 

భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని సుమారు 85 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల్లో 100కు పైగా పునరావాస కేంద్రాలు  ఏర్పాటు చేసి, సుమారు రెండు వేల కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్యసేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వరద ముంపు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి, ఐటీడీఏ పీఓ గౌతమ్, అదనపు కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, అనుదీప్‌ సందర్శించారు. బాధితులకు మెరుగైన సేవలందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఐటీసీ పీఎస్‌పీడీ భోజనం అందిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top