
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. కల్పించుకోవాలి... కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయానికి రాలేదు
బీఆర్‌ఎస్ నేతలతో పాటు అనేక మంది టచ్‌లో ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు, ప్రజా జీవితంలో ఎవరూ అవకాశం (స్పేస్) ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్తేనే తొవ్వ దొరుకుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా పూర్తి నిర్ణయానికి రాలేదని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎలా అడుగులు వేయాలనే అంశంపై వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. తాను పార్టీ పెడితే బీసీలకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.
శనివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం మీడియా ఇష్టాగోష్టిలో కవిత వివిధ అంశాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్. నన్ను బీఆర్‌ఎస్ సహా అనేక మంది నేతలు కలుస్తున్నారు. నేను కూడా పలువురితో సంప్రదింపులు జరుపుతున్నా. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు’ అని కవిత వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం.. మినహా హరీశ్‌పై కోపం లేదు
‘నీటి పారుదల శాఖకు సంబంధించిన ఫైళ్లను సరైన ప్రొసీజర్ పాటించకుండా నేరుగా సీఎంకు పంపడంపై 2016లోనే నేను కేటీఆర్‌ను అప్రమత్తం చేశా. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మినహా మాజీ మంత్రి హరీశ్‌రావుపై నాకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదు. కింది స్థాయిలో అధికారుల పరిశీలన, ఆమోదం లేకుండా ఫైళ్లు కేసీఆర్ వద్దకు వెళ్లాయి. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపింది. విచారణ సందర్భంగా అంతా కేసీఆర్ నిర్ణయమే.. అని హరీశ్‌రావు చెప్పినట్లు కమిషన్ నివేదికలో ఉంది’అని కవిత అన్నారు.
కృష్ణాలో క్రికెట్ ఆడుకోవాలి..
‘కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ప్రాంత వాసులు నదిలో క్రికెట్ ఆడుకోవాల్సిందే. ఆల్మట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది. రేవంత్‌రెడ్డి.. సోనియా ద్వారా కర్ణాటకపై ఒత్తిడి పెంచాలి. బనకచర్లతో పాటు ఆల్మట్టిపైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. ఈసారి మా ఊరు చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నా’అని కవిత పేర్కొన్నారు.