చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి 

Inauguration of Facade Illumination at Charminar by Central Minister Kishan Reddy - Sakshi

ఆ మేరకు ప్రతిపాదనలు పంపాం: కిషన్‌రెడ్డి 

చార్మినార్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణ ప్రారంభం

దూద్‌బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్‌ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్‌ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్‌ నగరంలో నేషనల్‌ సైన్స్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్‌లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. 

హైటెక్‌ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్‌ 
హైదరాబాద్‌లో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్‌ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్‌ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్‌ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్‌ను ప్రారంభించనున్నామన్నారు.

తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా అడిషనల్‌ డైరెక్టర్‌ జాన్వీ శర్మతో పాటు వినయ్‌ కుమార్‌ మిశ్రా, చంద్రకాంత్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top