
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ప్రధాన నగరంతోపాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, హైటెక్‌సిటీ, మాదాపూర్, కిస్మత్‌పూర్, శంషాబాద్, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, రాయదుర్గం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ను బుక్‌చేసుకునే వారి శాతం ఏడాదిగా గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
► అంతకు ముందు (2020) సంవత్సరంతో పోలిస్తే 2021 ఆగస్టు నాటికి మూడు పడకగదుల ఫ్లాట్స్‌ను బుక్‌చేసుకున్న వారి శాతం 44 నుంచి 56 శాతానికి పెరగడం విశేషం.
► అనూహ్యంగా డబుల్ బెడ్‌రూమ్ కొనుగోలుదారుల శాతం 47 నుంచి 31 శాతానికి తగ్గిందట. ఇక సింగిల్ బెడ్‌రూమ్‌లను కొనుగోలు చేసే వారి శాతం 15 నుంచి 11 శాతానికి తగ్గినట్లు ఈ అధ్యయనం తెలిపింది.
ఒడిదుడుకులు..అయినా పురోగమనమే..
► కోవిడ్, లాక్‌డౌన్‌డౌన్, ఆర్థిక వ్యవస్థ మందగమనం, అన్ని రంగాల్లో నెలకొన్న స్తబ్దత వంటి పరిణామాలు ప్రస్తుతం నిర్మాణరంగాన్ని ఒడిదొడుకులకు గురిచేస్తున్నాయి.
► కోవిడ్‌కు ముందు అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు బిల్డర్లు రూ.1400 నుంచి రూ.1600 వరకు వ్యయం చేసేవారు.
► ప్రస్తుతం మేస్త్రీలు, నిర్మాణ రంగ కూలీలకు దినసరి వేతనాలు అనూహ్యంగా పెరగడం, ఎలక్ట్రికల్, సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకలు, శానిటరీ విడిభాగాల ధరలు చుక్కలను తాక డంతో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1800 నుంచి రూ.2000 వరకు పెరిగింది.
► ఈ నేపథ్యంలోనూ నగర శివార్లలో అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలు ఏమాత్రం తగ్గలేదని ఈ అధ్యయనం పేర్కొంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు నూతన ప్రాజెక్టులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపింది.
► కాగా కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు, బిల్డర్లు..అపార్ట్‌మెంట్ నిర్మాణానికంటే ముందే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నారు.
► నిర్మాణం ప్రారంభం కాక మునుపే చదరపు అడుగుకు రూ.3000 నుంచి రూ.3500 ధరలు ఆఫర్ చేస్తున్నారు.
► అంటే వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు ఏకమొత్తంలో రూ.30 నుంచి రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిర్మాణం పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
► నిర్మాణం పూర్తయిన తరవాత ఈ ధరలు రెట్టింపవుతాయని బిల్డర్లు చెబుతున్నారు. దీంతో కొందరు వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లకు మొగ్గు చూపుతున్నట్లు అధ్యయనం తెలపడం గమనార్హం.