అద్దెల దరువు.. బిల్లుల బరువు 

Hyderabad Private Schools Face Serious Problems Due To Covid - Sakshi

కరోనా కష్టాల్లో బడ్జెట్‌ పాఠశాలలు

పునఃప్రారంభంపై నీలినీడలు

భవనాల అద్దె చెల్లింపులేక తాళాలు

మరి కొన్నింటికి కరెంట్‌ కట్‌  

సాక్షి,సిటీబ్యూరో: కరోనా మహమ్మారి ప్రైవేటు పాఠశాలలను కోలుకోలేని దెబ్బతీసింది. యాజమాన్యాలతో పాటు అందులో పనిచేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ ఫీజుతో పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు పాఠశాలలను ఇప్పటికే కార్పొరేట్‌ విద్యా సంస్ధలు నడ్డి విరిచాయి. దీనికితోడు కరోనా పంజా విసరడంతో నష్టాల్లో కూరుకుపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. ఆయా పాఠశాలలు కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్థం నెలకొంది. 

పునఃప్రారంభంపై నీలినీడలు.. 
ప్రైవేటు విద్యాసంస్థలకు అద్దె భవనాలు భారంగా మారాయి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా.. అద్దె భవనాలను అట్టిపెట్టుకుని ఉండటంతో వాటి నిర్వహణ తడిసిమోòపెడైంది, అద్దెలు, కరెంట్‌ బిల్లులు, వాచ్‌మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు గుదిబండగా మారాయి. విద్యార్ధుల  ఫీజుల వసూళ్లపై నమ్మకం లేక నిర్వాహకులు పాఠశాలలు పునః ప్రారంభానికి సాహసించే పరిస్థితులు కనిపించడంలేదు. 

నిర్వహణ భారమే.. 
ప్రై వేటు పాఠశాలల్లో దాదాపు 95 శాతం పైగా అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో పాఠశాలను హైస్కూల్‌ వరకు నడిపించాలంటే నెలకు కనీసం  రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, ప్రాథమిక పాఠశాల నిర్వహణకు రూ.లక్ష నుంచి 2 లక్షలవరకు ఖర్చువుతుంది. ఇందులో భవనాల అద్దె, కరెంటు, నీటి బిల్లులతోపాటు బస్సుల కిస్తీలు, ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది వేతనాలుంటాయి. ఫీజుల వార్షిక రుసుము తక్కువగా ఉన్నా...ఆవి కూడా వసూలు కాక, అప్పులు, ఇతర ఖర్చులు పెరిగి బడ్జెట్‌ పాఠశాలలు దివాళా తీశాయి.  

ఇదీ లెక్క.... 
రాష్ట్రంలో  10,526 ప్రైవేటు పాఠశాలలుండగా వీటిలో 2,487 కార్పొరేట్, 150 సీబీఎస్‌సీ, ఐసీఎస్, కేంబ్రిడ్జి సిలబస్‌తో నడుస్తున్న అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి. మిగిలిన 7039 పైగా సాధారణ ప్రైవేటు బడ్జెట్‌ పాఠశాలలున్నాయి.  మొత్తం పాఠశాలల్లో 40 శాతంపైగా పాఠశాలలు హైదరాబాద్‌ నగరంలోనే ఉండటం గమనార్హం.

మూసివేత దిశలో.. 
బడ్జెట్‌ పాఠశాలలు మూసివేత దిశవైగా అడుగులు వేస్తున్నాయి. నిర్వహణ భారమై  ఆర్థిక ఒత్తిడి భరించలేక కనీసం సగానికి పైగా పాఠశాలల యాజమాన్యాలు స్కూళ్లను మూసివేయాలని భావిస్తున్నారు. 

ఫీజు వసూళ్లపై దెబ్బ 
ప్రైవేట్‌ పాఠశాలకు  ఫీజుల వసూళ్లపై దెబ్బపడింది. సాధారణంగా కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకే విడత, లేదా రెండు విడతల్లో ఫీజులు  వసూలు చేస్తుంటారు. కరోన్‌ ఫస్ట్‌ వేవ్‌ వ్యాప్తితో  2019–20 విద్యా సంవత్సరం పాఠశాలల చివరి పనిదినాల్లో మూత పడటంతో 45 శాతంపైగా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు కాలేదు. 2020–21 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం కావడంతో ఫీజు వసూళ్లు 
అంతంత మాత్రంగా తయారైంది. 

హాజరు  తప్పనిసరి చేయాలి  
కరోనా కష్టకాలంలో ప్రత్యక్ష, పరోక్ష బోధనకైనా విద్యార్థులకు హాజరు తప్పని సరి చేయాలి. ఎకడమిక్‌ కేలండర్‌ విడుదల చేయాలి. విద్యార్ధుల ఫీజులపైనే  స్కూల్స్‌ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా బడ్జెట్‌ పాఠశాలలకు విద్యుత్‌ బిల్లులు తదితర బకాయిలను మాఫీ చేయాలి.  –కే. ఉమామహేశ్వర రావు, అధ్యక్షులు, టస్మా,హైదరాబాద్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top