వీడని క‘న్నీటి’ కష్టం

Hyderabad People Are Suffering Due To The Flood Water - Sakshi

ఇంకా ముంపు ముట్టడిలోనే.. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు

ఇళ్లు, సెల్లార్లలోకి చేరిన నీటిని తోడిపోస్తున్న బాధితులు

48 గంటలైనా ఇంకా చీకట్లే

సాయం కోసం పడిగాపులు ప్రజాప్రతినిధుల 

పరామర్శలపై ఆగ్రహావేశాలు

కిషన్‌రెడ్డికి బస్తీవాసుల నిరసన.. కలెక్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరాన్ని వరద కష్టాలు ఇంకా వీడలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు నగరవాసికి నరకాన్ని చూపించాయి. వాన వెలిసి 48 గంటలైనా అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో, అంధకారంలోనే ఉండిపోయాయి. గురువారం వాన తెరిపి నిచ్చినా.. పూడ్చలేని నష్టాలు, కష్టాల కడగండ్లు మాత్రం అలాగే మిగిలాయి. బాధితులకు తినడానికి తిండి.. కంటి నిండా కునుకు కరువయ్యాయి. వందలాది కుటుంబాలు ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం బిక్కుబిక్కుమంటున్నాయి. వాననీరు వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో ముంపు ప్రాంతాలు ఇంకా చెరువు లను తలపిస్తున్నాయి. కనీసం తాగేందుకూ నీళ్లు కరువై.. పాలు, ఇతర నిత్యావసరాలు అందక బాధితులు పస్తులతో తల్లడిల్లుతున్నారు.

ఇంకా ముంపు ముట్టడిలోనే ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని వారు.. బతుకుజీవుడా అంటూ బంధువుల ఇళ్లకు ప్రయాణమవు తున్నారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నీళ్లు వెళ్లే నాలాలన్నీ ఆక్రమణలకు గురవడం, భారీ వర్షపునీటి ప్రవాహానికి నాలాలు సరిపోకపోవడం.. నగరానికి కన్నీటి కష్టాలను మిగిల్చాయి. నాలాల పునరుద్ధరణ, ఆధునీకరణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమై శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

అదుపులోకి రాని పరిస్థితి
పల్లె చెరువుకు గండిపడటంతో లోతట్టు బస్తీల్లోకి నీరుచేరి 48 గంటలు కావస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దిగువన ఉన్న జీఎం కాలనీ, చావునీలలో కొద్దిగా నీటి ప్రవాహం తగ్గినా.. క్రాంతినగర్‌లో మాత్రం ఇళ్లలో నీరు అలాగే ఉంది. ఆయా బస్తీలవాసులు కంటి మీద కునుకు కరువై ఇంటి పైకప్పుల పైకెక్కి సాయం కోసం చూస్తున్నారు. అంబర్‌పేట లో చెరువు నీటి ప్రవాహం తగ్గలేదు. గురువారం కూడా పలు బస్తీల్లోంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగింది. మల్లికార్జున్‌ నగర్, రాహత్‌నగర్‌ ప్రాంతాలకు పైన ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, మొయిన్‌చెరువు నీరు ఇక్కడికి భారీగా పోటె త్తుతోంది. వర్ష బీభత్సంతో వణికిపోయిన పాతబస్తీ ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. ఇక్కడి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల ఆవరణలో నిలిచిన నీటిని పారబోసే పనిలోపడ్డారు.

కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో అల్లకల్లోలం...
నగరంలోని పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. ఈ నీటిని తోడిపోయడం తలకు మించిన భారమవుతోంది. సెల్లార్లలో భారీగా నీరు చేరడంతో ఎవరూ ప్లాట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. ఓవైపు అంధకారం.. మరోవైపు జలదిగ్బంధం.. ఇంకోవైపు నిత్యావసరాలు తెచ్చుకునే వీలులేక కాలనీలవాసులు నానాయాతన పడుతున్నారు. సెల్లార్లలోని కార్లు, టూవీలర్లు పూర్తిగా మొరాయించడంతో మెకానిక్‌ల వద్దకు పలువురు క్యూ కడుతున్నారు. కరెంట్‌ సరఫరా లేక, లిఫ్టులు పనిచేయక వృద్ధులు, అనా రోగ్య సమస్యలున్నవారు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సెల్లార్ల లోని మొత్తం నీటిని తొలగించి, ఎలాంటి తడి లేకుండా ఉంటేనే లిçఫ్టును ఉపయోగించాలని విద్యుత్‌ శాఖ హెచ్చరించడంతో పై అంతస్తుల్లోని వారు ప్రతి చిన్న అవసరానికి మెట్లు దిగక తప్పట్లేదు. అనేక కాలనీల్లోని అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల సెల్లార్లలోకి చేరిన వర్షపునీటిని తోడేందుకు ఒక్కసారిగా జనరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చుచేస్తే కానీ అవి దొరకడంలేదు.  ఆయా భవ నాల వాచ్‌మన్లు అపార్ట్‌మెంట్‌ సెల్లార్, పార్కింగ్‌ ప్రదేశాల్లో కేటాయించిన గదుల్లోనే ఎక్కువగా ఉంటుంటారు. సెల్లార్లు నీటితో నిండిపోవడంతో వీళ్ల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌ కాపలాతోపాటు అందులో ఉండే నివాసితులకు సమయానికి ఏదికావాలంటే అది సమకూర్చే వాచ్‌మన్లు ఇప్పుడు తాముండటానికే చోటులేక రోడ్డునపడ్డారు.

శివార్లలో ‘నీటి యుద్ధం’
నగర శివార్లలో రెండు కార్పొరేషన్ల మధ్య నీటి విషయంలో గంటల తరబడి సాగిన వాదోపవాదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. బడంగ్‌పేట కార్పొరేషన్‌ నుంచి పెద్ద చెరువుకు వరద ప్రవాహం పెరగడంతో లెనిన్‌నగర్‌ శ్మశానవాటిక వద్ద తాత్కాలికంగా కాలువను తవ్వి నీటిని దిగువకు వదిలారు. దీంతో జనప్రియ మహానగర్‌ ప్రధాన రహదారి పూర్తిగా కోతకు గురైంది. దీంతో జనప్రియ మహానగర్‌వాసులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి పెద్ద చెరువు నుంచి వచ్చే నీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా బడంగ్‌పేట కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు సైతం అక్కడికి చేరుకున్నారు. రెండు కార్పొరేషన్లకు చెందిన వారు భారీగా గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది.

మీ పేరు రాసి చచ్చిపోతాం..
హబ్సిగూడ లక్ష్మీనగర్‌లో బాధితులను పరామర్శించడంతో పాటు పరిస్థితుల అంచనాకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బోటులో అధికారులతో కలిసి వచ్చిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిపై.. ఇళ్లపై ఉండి సాయం కోసం చూస్తున్న ముంపు బాధిత మహిళలు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ‘అలానే వెళి్లో్పతారా? రెండ్రోజులుగా నీటిలో ఉంటూ పస్తులున్నా పట్టించుకోరా? మీ పేరు రాసి చచ్చిపోతాం’ అంటూ విరుచుకుపడ్డారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని
ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పారు.

కేంద్రమంత్రిపై అసహనం
హుస్సేన్‌సాగర్‌ నాలా పరీవాహక ప్రాంతమైన దత్తానగర్, హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌–1, దోమలగూడ డివిజన్‌లోని వెంకటమ్మ బస్తీలో  పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘వర్షాలతో మూడ్రోజులుగా ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడా మీరొచ్చేది’ అంటూ బస్తీవాసులు నిలదీశారు. స్వల్ప ఆగ్రహానికి గురైన కిషన్‌రెడ్డి.. వర్షాల్లో చిక్కుకున్న మిమ్మల్ని చూసి పరామర్శించి, చేతనైన సాయం చేద్దామని వచ్చామని సర్దిచెప్పారు. ‘మమ్మల్ని నిలదీస్తే మీకేం వస్తుంది? మీరు ఓట్లు గెలిపించుకున్న వాళ్లను నిలదీయండి’ అంటూ బస్తీవాసులకు బదులిచ్చారు.

తహసీల్దార్‌ స్థాయి కూడా కాదా నాది: కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీల్లో పర్యటిస్తున్నట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్, జలమండలి తదితర అధికారులకు ముందస్తు సమచారమిచ్చినా.. సంబంధిత విభాగాల అధికారులెవరూ తన పర్యటనకు హాజరుకాకపోవడం కిషన్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. పర్యటనలోనే ఆయన కలెక్టర్‌ శ్వేతామహంతికి ఫోన్‌ చేసి ‘ఏమ్మా..నేను వస్తున్నట్లు ముందే చెప్పాను కదా? మీ వాళ్లెవరూ లేరెందుకు? ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మీ ఉద్దేశమేంటి? నేను వస్తే కనీసం తహసీల్దార్‌ అయినా రాడా నా వెంట. తహసీల్దార్‌ స్థాయి కూడా కాదా అమ్మా నాది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

బాధితులకు కాంగ్రెస్‌ చేయూత
ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల బాధితులకు కాంగ్రెస్‌ ఆహార పదార్థాలను అందించింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్, నాంపల్లి ఇన్‌చార్జి ఫిరోజ్‌ ఖాన్, íపీసీసీ కార్యదర్శి మధుకర్‌యాదవ్, మహేష్‌యాదవ్‌ తదితరులు బాధితులను పరామర్శించారు. స్థానికుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి సూచించారు. ఈ సందర్భంగా మక్తాలో బ్రెడ్డు, పాలు అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top