Hussain Sagar: సాగర ప్రియులకు శుభవార్త.. తగ్గిన కాలుష్యం,పెరిగిన ఆక్సిజన్‌

Hyderabad: Oxygen Percentage Hike In Hussain Sagar - Sakshi

బయో రెమిడియేషన్, భారీవర్షాలే కారణం

పెరిగిన ప్రాణవాయువు మోతాదు

స్వచ్ఛంగా మారిన జలాలు

పీసీబీ తాజా పరిశోధనలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో ఆక్సిజన్‌ మోతాదు గణనీయంగా పెరిగింది. పలు రకాల చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడకు అత్యావశ్యకమైన కరిగిన ఆక్సిజన్‌ మోతాదు పెరగడంతో సాగర్‌ను సందర్శించే సిటీజనులు సైతం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంటున్నట్లు కాలుష్యనియంత్రణ మండలి(పీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది.

పర్యావరణహిత బయోరెమిడియేషన్‌ విధానం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర జలాలు స్వచ్ఛంగా మారడంతోపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఇతక కాలుష్యకాలుండడం ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా కరిగిన ప్రాణవాయువు మోతాదు ప్రతి లీటర్‌ సాగర జలాల్లో 4 మిల్లీ గ్రాములుగా నమోదైనట్లు స్పష్టమైంది. సాగర్‌లో కాలుష్య మోతాదు తగ్గడంతోనే ఆక్సిజన్‌ శాతం పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. 
చదవండి: ఫిట్‌గా ఉన్నా..జిమ్‌ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు?

బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు 
సాగర జలాల స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు చేపట్టిన పర్యావరణ హిత బయోరెమిడియేషన్‌ విధానం క్రమంగా సత్ఫలితాన్నిస్తోంది. ఈ విధానంలో బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుంది. ఏడాదిగా ఈ విధానం అమలుతో హుస్సేన్‌సాగర్‌ నలుమూలల్లోనూ ఆక్సిజన్‌ మోతాదు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. సుమారు 70 శాతం ఈ విధానం విజయవంతమైందని స్పష్టంచేసింది. గతంలో జలాల్లో ఆక్సీజన్‌ మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టిన కారణంగానే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే.

పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమల్లో ఉన్నట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మన దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇటీవలికాలంలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధిక లేదా అత్యల్ప కరిగిన ఆక్సిజన్‌ మోతాదు ఉన్న జలాల్లో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ కష్టాసాధ్యమౌతుందని స్పష్టంచేశారు. 
చదవండి: కుట్లు వేశారు.. కడుపులో సూది మరిచారు!

బీఓడీ అధికంగానే.. 
సాగర జలాల్లో ఆక్సిజన్‌ మోతాదు పెరగడం ఊరటనిచ్చినా.. బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మోతాదు ప్రతి లీటర్‌ సాగర జలాల్లో 22 మిల్లీగ్రాములుగా నమోదైనట్లు పీసీబీ నివేదిక తెలిపింది. పీసీబీ ప్రమాణాల మేరకు బీఓడీ 3 మిల్లీగ్రాములుగా ఉండాలి. కాగా ఇటీవలి వర్షాలకు కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చి సాగర్‌లో చేరిన జలాల్లో పారిశ్రామిక కాలుష్య ఆనవాళ్లుండడంతో బీఓడీ మోతాదు పెరిగినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. 

స్వచ్ఛ సాగర్‌ను సాకారం చేయాలి 
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన వర్షపునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయి గడ్డకట్టిన వ్యర్థాలను తొలగించాలి. ఆస్ట్రియాలోని డాన్యుబ్‌ నది తరహాలో సాగర్‌ను ప్రక్షాళన చేయాలి. సాగర్‌ చుట్టూ వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించరాదు. 
– సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త 

హుస్సేన్‌సాగర్‌ జలాల నాణ్యత, పలు కాలుష్యకాల మోతాదు ఇలా ఉంది

ప్రతి లీటరు నీటిలో మిల్లీగ్రాముల్లో.. 

ప్రాంతం  గాఢత   కరిగిన  ఆక్సిజన్‌  బీఓడీ
ఎన్‌టీఆర్‌పార్క్‌     7.3   4 మి.గ్రా  22 మి.గ్రా 
లుంబినీపార్క్‌     7.4  4   22 
బుద్ధవిగ్రహం   7.4  4.2   27  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top