కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా? | Hyderabad Metro Phase‑2 remains stuck awaiting central approval | Sakshi
Sakshi News home page

కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?

May 14 2026 7:50 AM | Updated on May 14 2026 11:56 AM

Hyderabad Metro Phase‑2 remains stuck awaiting central approval

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్‌ సహా అధికారుల  బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ  సర్ఫరాజ్‌ అహ్మద్‌ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. 

.. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి టేకోవర్‌ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్‌తో పాటు ఎల్‌అండ్‌టీ బకాయిల చెల్లింపు జూన్‌తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.

ఇంకా ఎన్నాళ్లు..?
రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్‌ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్‌లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్‌లో రెండో దశను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్‌లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్‌లు  అందలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. 

రెండో దశలో మొత్తం 8 కారిడార్‌లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్‌లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్‌ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది.    

గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా.. 
మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్‌గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement