ఎకరం రూ. 200 కోట్లు | Hyderabad land auction to set new records once again | Sakshi
Sakshi News home page

ఎకరం రూ. 200 కోట్లు

May 20 2026 5:48 AM | Updated on May 20 2026 5:48 AM

Hyderabad land auction to set new records once again

ప్రీ–బిడ్‌లో ఆసక్తి కనబర్చిన దిగ్గజ సంస్థలు

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో 11.38 ఎకరాలు వేలానికి సిద్ధం  

ఐటీసీ కోహినూర్‌కు సమీపంలో ఈ ఖరీదైన స్థలాలు 

ఇప్పటికే ఈ ప్రాంతంలో రూ.177 కోట్లు పలికిన ఎకరం ధర 

జీసీసీలు కేంద్రంగా ఉండడమే ఈ ప్రాంతానికి డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్‌ భూముల వేలం మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించనుంది. గతంలో రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు పలికితేనే వామ్మో అనుకొని ఆశ్చర్యపోయాం. కానీ, ఈసారి ప్రభుత్వం నిర్వహించనున్న ఇదే ప్రాంత భూముల వేలంలో పాత రికార్డులు చెరిగిపోనున్నాయి. సర్వే నంబరు 83/1లో అభివృద్ధి చేసిన 11.38 ఎకరాల లేఅవుట్‌లో ఎకరం రూ.200 కోట్లు ధర పలుకుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రీ–బిడ్‌ సమావేశంలో దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా పాల్గొనడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు అంటున్నాయి. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ప్రాంతంలో విస్తరించాయి. దీంతో ఇక్కడి భూములను దక్కించుకోవడానికి బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపుతుండడమే డిమాండ్‌కు కారణం.  

రూ.139 కోట్ల రిజర్వ్‌ ప్రైస్‌.. 
ప్రభుత్వం ఈ విడతలో రెండు పార్సిళ్లుగా మొత్తం 11.38 ఎకరాలను వేలానికి ఉంచింది. టీ–హబ్‌ సమీపంలో 6.29 ఎకరాలు, ఐటీసీ కొహినూర్‌ సమీపంలో 5.09 ఎకరాల స్థలం ఉంది. ఈ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.139 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.177 కోట్ల రికార్డు ధర పలికింది. దీంతో ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు, జీసీసీ, ఐటీ రంగం విస్తరణ నేపథ్యంలో ఈసారి ఎకరం ధర రూ.200 కోట్ల మార్కుతో రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 


డిమాండ్‌ ఎందుకు? 
దేశంలోనే అత్యుత్తమ ఐటీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంగా రాయదుర్గం పేరుగాంచింది. మైండ్‌ స్పేస్‌ ఐటీ పార్క్, నాలెడ్జ్‌ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి గ్లోబల్‌ ఐటీ కంపెనీల క్యాంపస్‌లు దీనికి సమీపంలోనే ఉండటంతో కొత్తగా వచ్చే కంపెనీలు సైతం రాయదుర్గంలోనే స్థిరపడాలని చూస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ వంటి ప్రధాన ఐటీ జోన్లకు రాయదుర్గం కేంద్ర బిందువుగా ఉంది. నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి దీనికి అద్భుతమైన కనెక్టివిటీని ఇస్తున్నాయి. రాయదుర్గం మెట్రో టెర్మినల్‌ స్టేషన్‌ ఇక్కడే ఉండటం వల్ల ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. మెట్రో రెండో దశ విస్తరణ కూడా ఈ ప్రాంతానికి మరింత ఊపు ఇవ్వనుంది. ఐటీ పార్కులతోపాటు విలాసవంతమైన గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు, హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు, అంతర్జాతీయ పాఠశాలలు, మాల్స్, స్టార్‌ హోటళ్లు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి.  

Advertisement
 
Advertisement
Advertisement