అక్షర యోధులకు అరుదైన గుర్తింపు | Senior Journalists Being Felicitated With Legendary Awards On Stage At HyBiz TV Media Awards 2026 In Hyderabad | Sakshi
Sakshi News home page

అక్షర యోధులకు అరుదైన గుర్తింపు

May 3 2026 11:37 AM | Updated on May 3 2026 12:47 PM

HyBiz TV Media Awards 2026

హైదరాబాద్‌: పగలూ రాత్రీ తేడా లేకుండా కాలంతో పరుగులు పెడుతూ పనిచేయాల్సి వచ్చే కఠోరశ్రమతో కూడుకున్న రంగం  జర్నలిజం అని.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఆదర్శాలు, విలువలతో వచ్చి, ఆచరణలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

‘హైబిజ్ టీవీ’ మీడియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒకప్పుడు అలా కష్టాలు అనుభవించినవాణ్ణే. అయితే, ప్రగాఢమైన అభిరుచితో వదలకుండా కృషి చేస్తే గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఇవాళ మీడియా ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా ఉందన్నారు.

జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు లోతుగా ఆలోచించి, మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. అందుకు ప్రభుత్వం ఓ వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు దశాబ్దాల క్రితమే చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, “1992లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేసిందే... మా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు మేము చేస్తున్న మంచి పనులను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నాం. అంతెందుకు... మా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అనుకూల, క్రియాశీలక విధానాల వల్ల గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కమర్షియల్ స్పేస్ నూటికి నూరుపాళ్ళు నిండిపోయింది.

అలాగే, గత రెండేళ్ళలో ప్రతి 3 రోజులకు ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (‘జీసీసీ’ - ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో విదేశీ సంస్థల తాలూకు అనుబంధ సంస్థలు భారత్‌లో రావడం) హైదరాబాద్‌లో నెలకొనడం జరిగింది. ఒక్క గత ఏడాదిలోనే 70 జీసీసీలు వచ్చాయి. అలాగే, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామం ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్‌తో అనుసంధానమైంది. ఎక్కడికైనా సెకనులో వెయ్యో వంతులో సమాచారాన్ని పంపే వీలు కలిగింది. ఇది డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పరాకాష్ఠ” అని శ్రీధర్ బాబు వివరించారు.

శనివారం అట్టహాసంగా సాగిన ఈ మీడియా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ అధ్యక్షుడు – రాజ్యసభ మాజీ సభ్యుడు వివేక్ గుప్తా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ‘భార‌తీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి, ‘లైఫ్ స్పాన్’ అధినేత నరేంద్ర రామ్ నంబుల, ‘క్రెడాయ్ - హైద‌రాబాద్’ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి, అలాగే ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్ట‌ర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) త‌దిత‌రులు పాల్గొన్నారు.

2026కు గాను నిర్వహించిన తాజా అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల కుటుంబాలలోని ప్రతిభావంతులైన పిల్లల చదువులకు ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయల చొప్పున హైబిజ్ టీవీ - లైఫ్ స్పాన్ సంస్థలు ఆర్థికంగా చేయూత అందించడం విశేషం. అలా తమ ప్రతిభతో స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల్లో ఏ. వికాస్ గౌడ్ (97.02% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణుడు), ఏ. స్రవంతి (ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని), ఎన్. సమీక్ష (97.10% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి)..

ఎస్. అనుశ్రిజ (బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని), ఎస్. అశ్వంత్ కుమార్ (97% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి), టి. తరళశ్రీ (97% మార్కులతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పూర్తి), ఎస్. సిరి (97.1% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), ఇ. వినీత్ (98% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), సహస్ర (ఇంటర్మీడియట్ పూర్తి), హెచ్. సాయి కిరణ్ (పదో తరగతి పూర్తి) తదితరులున్నారు. ఉపకార వేతనాల చెక్కును మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం, ఆ కుటుంబాల సంతోషంతో సభావేదిక కళకళలాడింది.

‘హైబిజ్ టీవీ - మీడియా అవార్డ్స్ 2026’లో భాగంగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఐదుగురికి ‘లెజెండ‌రీ పుర‌స్కారాలు’ అంద‌జేశారు. ఈ ‘లెజండరీ పురస్కారాలు’ అందుకున్న వారిలో... జాతీయ జర్నలిస్టు భూపేంద్ర చౌబే (మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్ఎన్ - న్యూస్18, ఇండియా ఎహెడ్, ఎన్డీ టీవీ), తెలుగువారైన వెటరన్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు (ఆలిండియా రేడియో), ఆంగ్ల పత్రికా ప్రపంచంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సీహెచ్. సుశీల్ రావు (టైమ్స్ ఆఫ్ ఇండియా - దక్కన్ క్రానికల్), పలు మీడియాల్లో ప్రసిద్ధురాలైన సి. మృణాళిని, ప్రకటనల రంగంలో విస్తృత సేవలు అందించిన శ్రీనాథ్ అయ్యర్ (హిందూ, హిందుస్థాన్ టైమ్స్) ఉన్నారు.

ఈ సందర్భంగా భూపేంద్ర చౌబే మాట్లాడుతూ, “ఒక రకంగా ఇవాళ జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ భాషల్లోని మీడియాయే చాలా శక్తిమంతంగా ఉంది. అదే సమయంలో, రానున్న రోజుల్లో మీడియా సంస్థల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం ఎక్కువ కానుంది” అని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ నగరంలో ఓ తెలియని ఆత్మీయత ఉంది. నేను యూపీకి చెందినవాడిని అయినప్పటికీ, తెలుగు భాష, తెలుగు సినిమా, తెలుగు సంగీతం అంటే మక్కువ ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ అవార్డుల ఉత్సవానికి అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టెస్ట్ మ్యాచ్‌ల నుంచి వన్డేలు, 50 ఓవర్లు, ఇప్పుడు టీ20లకు క్రికెట్ మారినట్టే... కాలంతో పాటు మీడియా సైతం ఎంతో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా... ఏ రంగంలోనైనా గుర్తింపు అనేది మరింత శ్రమించడానికి ప్రేరణనిస్తుంది. దాదాపు 20 ఏళ్ళు యూత్ లీడర్‌గా ఎన్.ఎస్.యు.ఐ లాంటి వాటిలో నిరంతరం పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అదే విధంగా మీడియా మిత్రులు తమ రంగంలో మరింత కృషి చేయడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.

అందుకు తగ్గట్టే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కేట‌గిరీలో క‌లిపి 60 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులను ‘హైబిజ్ టీవీ’ మీడియా పుర‌స్కారాల‌తో సత్కరించింది. లోతైన పరిశోధనతో ఎన్నో విశేషాలను వెలికితీసి, తెలుగు సినీ రంగ చరిత్రను అక్షరబద్ధం చేయడంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తూ, గతంలో ప్రభుత్వ నంది, గద్దర్ అవార్డులను అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ – రచయిత డాక్టర్ రెంటాల జయదేవను “తెలుగు సినీ చరిత్రకు ఉత్తమ డాక్యుమెంటేషన్ చేస్తున్న అరుదైన జర్నలిస్టు”గా గుర్తించి, అవార్డుతో గౌరవించింది. జయదేవను మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి, ఉత్తమ ‘తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం’గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన రచన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం గురించి తెలుసుకున్నారు.

‘సాక్షి’ మీడియా గ్రూపు నుంచే మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలలో బొంబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గుండాల శ్రీనివాసరావు (ప్రింట్ స్పెషల్ జ్యూరీ- అప్ కంట్రీ), అలాగే ప్రకటన, మార్కెటింగ్ రంగాలకు చెందిన శ్రీనివాస్ (ఎడ్యుకేషన్ స్పెషల్స్), వెంకటేశ్ (రిటైల్ యాడ్స్), వేణు (ఇంజనీరింగ్ కాలేజెస్) ఉన్నారు.

ఇక, వ్యవసాయ రంగంపై విశేష కృషి చేస్తున్న అంకితభావం గల జర్నలిస్ట్ వలేటి గోపీచంద్ (ఆకాశవాణి), సినీ రంగ పాత్రికేయానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చల్లా శ్రీనివాస్ (జ్యోతి), ఎడిటోరియల్ విభాగంలో సీనియరైన భాస్కర్ తాటికొండ (హన్స్ ఇండియా), పొలిటికల్ రిపోర్టింగ్‌లో సీనియరైన గూడ ఆంజనేయులు గౌడ్, టీవీ రంగంలో పాపులరైన కాట్రగడ్డ అజిత (99 టీవీ), న్యూస్ యాంకర్లు స్వర్ణ రోజా (రాజ్ టీవీ), అపర్ణ (వి6), వినోదరంగంలో పేరు తెచ్చుకున్న టీవీ జర్నలిస్ట్ తారక్ (ఎన్టీవీ), టీవీ రిపోర్టర్ సత్యనారాయణ, ప్రింట్ జర్నలిస్ట్ పి. జగదీశ్వర్ (నవ తెలంగాణ), అలాగే మంగుమూరి శ్రీనివాస్, వి. సురేశ్ తదితరులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.

విసుగూ, విరామం లేకుండా విజేతలందరికీ మంత్రే స్వయంగా అవార్డులు అందించడం గమనార్హం. అవార్డు అందుకున్న విజేతలందరూ తమ సంతోషం వ్య‌క్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి ‘హైబిజ్ టీవీ’ త‌గిన గుర్తింపునిచ్చింద‌నీ, ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని క‌లిగిస్తోంద‌నీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని కోరారు.

ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి మీడియా అవార్డ్స్ విజేతలకు ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలు సైతం అందించేందుకు ‘క్రెడాయ్’ ముందుంటుందని ‘క్రెడాయ్ - హైద‌రాబాద్’ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి ప్రకటించడం విశేషం. “హైదరాబాద్ నగరంలోని ఈ ప్రాంతం (హైటెక్ సిటీ)లో స్థిరాస్తి విలువ గత పాతికేళ్ళలో వంద రెట్లు పెరిగింది. కేవలం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదీ అతి తక్కువగా కేవలం 12.5 శాతమే ఉన్నది స్థిరాస్తి రంగమే. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే స్థిరాస్తుల రంగంపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేలా మీడియా మరిన్ని కథనాలు అందించా”లని జైదీప్ రెడ్డి అభ్యర్థించారు.

విజేతలను ఎంపిక చేసిన విశేష అనుభవజ్ఞుల బృందం పక్షాన సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ గత ఆరేళ్ళ అవార్డుల ప్రస్థానాన్ని వివరించారు. “మీడియా రంగంలో అందరికీ తెలిసేది జర్నలిస్టులే. కానీ, అడ్వర్టయిజింగ్, సర్క్యులేషన్ వారు ఈ పరిశ్రమలో అన్ సంగ్ హీరోస్” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి, ‘సాక్షి’ మీడియా గ్రూప్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, మార్కెటింగ్ విభాగంలో ఉన్నత పదవి నిర్వహించిన రమణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయి శేఖర్, ‘మిసిమి’ సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక అధిపతి – ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘ఆలిండియా రేడియో’ విశ్రాంత ఉన్నతోద్యోగి సి.ఎస్. రాంబాబు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, ‘హైబిజ్ టీవీ’కి చెందిన సుశిక్షితులైన సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement