హుజురాబాద్‌ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం | Huzurabad Bypoll Results: VVPAT Is Crucial If The EVM Machine Is To Fail | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll Results: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం

Nov 2 2021 7:27 AM | Updated on Nov 2 2021 8:35 AM

Huzurabad Bypoll Results: VVPAT Is Crucial If The EVM Machine Is To Fail - Sakshi

ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు.

సాక్షి, కరీంనగర్‌: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు.

ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్‌ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
చదవండి: హుజురాబాద్‌ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్‌

ఈవీఎంలు మొరాయించినా..
ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్‌ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్‌ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. 
చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్‌ తీర్పు నేడే 

ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్‌ టేబుల్స్‌ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు.

కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్, రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రవీందర్‌ రెడ్డి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement