Hyderabad Private Hostels: హైదరాబాద్‌లో వాటికి ఫుల్‌ డిమాండ్‌.. 30 శాతం వరకు పెరగనున్న చార్జీలు

Hyderabad: Job Notifications Effect Full Demand For Private Hostels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలోని ప్రైవేటు హాస్టల్స్‌కు తాకిడి పెరిగింది. సర్కారు జంబో కొలువుల భర్తీ ప్రకటనతో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు నగరానికి క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్‌ సెంటర్లు గల ప్రాంతాల్లోని హాస్టల్స్‌ గదులకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా హాస్టల్స్‌ నిర్వాహకులు గదులు, మెస్‌ చార్జీలు కూడా 20 నుంచి 30 శాతం పెంచేస్తున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే నిరుద్యోగ అభ్యర్థులు అద్దె గదుల కంటే హాస్టళ్లలో ఉండటానికి మొగ్గు చూపుతారు.   (చదవండి: ట్రాఫిక్‌ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే )

రెండువేలకు పైనే 
హైదరాబాద్‌ నగరంలో రెండున్నర వేలకు పైగా సాధారణ, లగ్జరీ, డీలక్స్‌ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేందుకు సౌకర్యాలకు తగట్టు నెలకు కనీసం  రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు చార్జీలుంటాయి. కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలతో అనుసంధానంగా కూడా నడుస్తున్నాయి. హాస్టళ్లు కనీసం 50 మంది నుంచి 150 మందితో నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు , జవహర్‌నగర్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావునగర్‌తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి,మాదాపూర్, దిల్‌సుఖ్‌ నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో హాస్టళ్లు ఉన్నాయి. 

గత రెండేళ్లుగా .. 
కోవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రైవేటు హాస్టల్స్‌ మూతపడ్డాయి. ఇటీవల థర్డ్‌వేవ్‌లో తెరుచుకున్నప్పటికి నిర్వహణ భారంగా తయారైంది. అద్దె చెల్లించలేక సగానికి పైగా ఖాళీఅయ్యాయి. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు నష్టాల్లో మునిగిపోయాయి. కొందరు మాత్రం సగం అద్దె చెల్లిస్తూ నష్టాలను భరిస్తూ వచ్చారు. తాజాగా సర్కారు ఉద్యోగ ప్రకటనలు రానున్నడంతో తిరిగి హాస్టల్స్‌కు పాత కళ వస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top