
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 26,129 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
రేకుల షెడ్డు కూలి రెండు ఆవులు, నాలుగు దూడల మృత్యువాత
సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 14,553 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు.
వరి 16,298 ఎకరాల్లో, మక్క 2,784.16 ఎకరాల్లో, జొన్న 705.2 ఎకరాల్లో, గోధుమ ఐదు ఎకరాల్లో, ఉల్లిగడ్డ 12 ఎకరాలు, బొప్పాయి పది ఎకరాలు, పొగాకు 20 ఎకరాలు, మామిడి 192 ఎకరాలు, కూరగాయలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నాయని పేర్కొ న్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహా్మజీవాడి గ్రామంలో గాలిదుమారానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు అక్కడికక్కడే మృతిచెందాయి.
మరోనాలుగు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 6,058 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పది మండలాల్లోని 44 గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 3,076 మంది రైతులు నష్టపోయారన్నారు. అత్యధికంగా 5,661 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.