
అన్నం పెడుతున్న గ్రానైట్ రాయి
మహబూబాబాద్ జిల్లాలో 50 గ్రానైట్ క్వారీలు
జిల్లావ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి
దేశ, విదేశాలకు గ్రానైట్ రాళ్ల ఎగుమతులు
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో భారీగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పలు మండలాల్లో గ్రానైట్ క్వారీ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 40 ఏళ్లుగా అంతర్జాతీయంగా పేరుగాంచిన మెడివెస్ట్ గ్రానైట్, గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.. జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం, మీఠ్యతండా, కేసముద్రం మండలం తీగలవేణి, అర్పపల్లి గ్రామాల్లో క్వారీలను నిర్వహిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విస్తరించిన 50 గ్రానైట్ క్వారీ పరిశ్రమల్లో.. ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. మేనేజర్ నుంచి వాచ్‌మన్ వరకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు ఒడిశా, అస్సాం, బిహార్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి దొరుకుతోంది.
జిల్లాలో ఖరీదైన గ్రానైట్
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, కేసముద్రం మండలం అర్పనపల్లి, తీగలవేణి, కేసముద్రం, నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న క్వారీల నుంచి తీస్తున్న బ్లాక్ గ్రానైట్ సిరులు కురిపిస్తోంది. ఇది ఖరీదైన గ్రానైట్‌గా పేరొందింది. ఈ గ్రానైట్‌ను హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు, గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర కూడా దేశ, విదేశాలకు నల్ల గ్రానైట్‌ను ఎగుమతి చేస్తున్నారు.
యంత్రాల విడిభాగాలతో ఉపాధి
భూగర్భం నుంచి గ్రానైట్ ఖనిజ సంపద తీయడానికి ఉపయోగించే యంత్రాల విడిభాగాలను సరఫరా చేస్తూ కూడా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. గ్రానైట్ బండలను లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తారు. అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో టైల్స్‌గా కట్ చేయడం, పాలిష్ చేసి విదేశాలకు సరఫరా చేయడం వరకు అంతా ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ క్వారీల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.
పదేళ్లుగా గ్రానైట్ క్వారీలోనే..
పదేళ్లుగా ఇనుగుర్తి మండలం మీఠ్యతండా గ్రానైట్ క్వారీలోనే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. క్వారీ ద్వారా ఉపాధితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. క్వారీ ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. గ్రానైట్ క్వారీలు నిర్వహించడానికి నిర్వాహకులు ఎంతో శ్రమించాలి. – గుండాల శోభన్, చిన్ననాగారం
సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా
ఒక క్వారీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. క్వారీల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి క్వారీలో ఉపాధి కల్పిస్తున్నారు. మా పరిధిలో 30 ఏళ్లుగా గ్రానైట్ క్వారీలను నడుపుతున్నారు. – గుగులోత్ రాజేందర్, ఇనుగుర్తి మండలం మీఠ్యతండా
ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రానైట్ నాణ్యమైనది
పాతికేళ్లుగా గ్రానైట్ ఫీల్డ్‌లోనే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లభించే గ్రానైట్ నాణ్యతలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. జిల్లాలో తీసే గ్రానైట్ సంపదకు భలే డిమాండ్ ఉంది. – రావులపల్లి రవికుమార్, సూపర్‌వైజర్, మెడివెస్ట్ గ్రానైట్, కేసముద్రం