రూ.లక్షకో డ్రైవింగ్‌ స్కూల్‌

Fake Driving Schools On Every Street In Greater Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల నగరంలో తెల్లవారుజామున రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈమధ్య కాలంలో మద్యం తాగి  అపరిమితమైన వేగంతో వాహనాలు నడుపుతూ  ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇలా  వాహనాలు నడుపుతున్న వారిలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండడం లేదని, అరకొర డ్రైవింగ్‌ అనుభవంతో  రోడ్డుమీదకు వచ్చి ప్రమాదాలకు పాల్పడుతున్నారని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ డ్రైవింగ్‌ స్కూళ్లతో ఈ తరహా ఎలాంటి  శిక్షణ, నైపుణ్యం,అనుభవం లేని డ్రైవర్లు వాహనాలతో బయటకు వస్తు న్నారు. దీంతో డ్రంకన్‌ డ్రైవ్‌తో పాటు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి.  

నిబంధనలకు పాతర... 

  • డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వహణ ప్రహసనంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణా అధికారులు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో  రూ.80 వేల నుంచి  రూ.లక్ష  వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
  • సాధారణంగా  మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి  డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణను  క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే అనుమతినివ్వాలి. ఇందుకోసంసదరు నిర్వాహకులు రూ.10 వేలు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రవాణా శాఖకు చెల్లించాలి.
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారే డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణకు అర్హతను కలిగి ఉంటారు. అనుభవజ్ఞుడైన ఇన్‌స్ట్రక్టర్‌ (శిక్షణనిచ్చే వ్యక్తి) ఉండాలి.  
  • డ్రైవింగ్‌ స్కూల్‌ కోసం ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీస్‌ తప్పనిసరి. ట్రాఫిక్‌ నిబంధనలపై ఇక్కడ శాస్త్రీయమైన బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకొనే మెకానిజంలో కూడా శిక్షణనివ్వాల్సి ఉంటుంది.  
  • చాలా మంది డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు ఎలాంటి కార్యాలయం కూడా లేకుండానే  కారుపై డ్రైవింగ్‌ స్కూల్‌ బోర్డు ఏర్పాటు చేసుకొని కొంతమంది అధికారుల సహాయంతో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణకు కావాల్సిన ఫామ్‌–11 సంపాదిస్తున్నారు.   

ఇదో తరహా గొలుసుకట్టు.. 

  • అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్‌ స్కూళ్లు  అభ్యర్ధుల నుంచి నెలకు రూ.5000 నుంచి రూ.8000 వరకు వసూలు చేసి  కనీసం 30 రోజులు కూడా  శిక్షణనివ్వకుండానే  వదిలేస్తున్నారు. ఇలా అరకొర శిక్షణ తీసుకున్నవారు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకొని యథేచ్ఛగా ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తున్నారు.  
  • మరోవైపు ఇలాంటి నకిలీ స్కూళ్లు నగరమంతటా బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని వినియోగదారులను మోసగిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  
  • గ్రేటర్‌లో అన్ని ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్‌ స్కూళ్లు 120 వరకు ఉంటే నకిలీ స్కూళ్లు వెయ్యికిపైనే ఉన్నట్లు అంచనా.  

తీవ్రంగా నష్టపోతున్నాం:  
కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇలాంటి నకిలీలతో  తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. ఇలాంటి వాటిని ఆర్టీఏ అధికారులు నియంత్రించాలి.  
– శ్రీకాంత్‌రెడ్డి సామల, తెలంగాణ డ్రైవింగ్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్మి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top