మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

Ex MLA Kistareddy passed away - Sakshi

కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎడ్మ 

మధ్య తరగతి కుటుంబంలో జన్మించి

అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి..  

రైతుల పక్షాన ఎన్నో పోరాటాలు 

అప్పట్లో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలని పాదయాత్ర 

సాక్షి, కల్వకుర్తి/కల్వకుర్తి: రైతుల ప్రధాన సమస్యల్లో ఒకటైన కరెంట్‌ ఇక్కట్లు తీర్చాలని ఎన్నో పోరాటాలు చేసి.. చివరికి సమస్య పరిష్కారానికి కృషిచేసి కరెంట్‌ కిష్టారెడ్డిగా పేరు గడించిన ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పారీ్టలో కొనసాగుతున్నారు.  

అభివృద్ధిలో చెరగని ముద్ర 
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతోపాటు.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి. 1994 నుంచి 2004 వరకు విద్యుత్‌ కోసం ఆమరణ దీక్ష చేసి రైతుల పక్షాన పోరాటం చేసిన నాయకుడు ఆయన. విద్యుత్‌ సరఫరా సరిగా లేక బోరు మోటార్లు కాలిపోయి.. చేతికొచ్చే పంటలు ఎండిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకునే రోజుల్లో వారి బాధలు చూసి చలించిన ఆయన 9రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎట్టకేలకు విద్యుత్‌ సమస్యను తీర్చి కరెంట్‌ కిష్టన్నగా పేరు గడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనకు ఉద్యమాలు ఎన్నో చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించాక నియోజకవర్గంలో 18.. 33/11కేవి సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించి విద్యుత్‌ కష్టాలు తీర్చాడు. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డికి కిష్టారెడ్డి ప్రీతిపాత్రు నిగా ఉన్నాడు. సబ్సిడీ కందిపప్పు పథకాన్ని కల్వకుర్తిలోనే ప్రారంభించారు. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి కృషిచేశారు. అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, ప్రస్తుత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ తదతరులతో సత్సంబంధాలు నెలకొల్పారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరనిలోటని పలువురు పేర్కొంటున్నారు.   

ఎడ్మ ఆశయ సాధనకు కృషి : మంత్రి 
జీవితాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం పాటుపడిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలో ఎడ్మ కిష్టారెడ్డి పారి్థవదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచి మాజీ ఎమ్మెల్యే భార్య పుష్పమ్మ, కుమారుడు మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యంను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌ ఆయన మృతికి సంతాపం తెలిపారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఎడ్మ కిష్టారెడ్డిదని కొనియాడారు. నివాళులరి్పంచిన వారిలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జానారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పద్మావతి, వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అభిమానులు  హాజరయ్యారు. 

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు  
ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన పారి్థవదేహాన్ని ఇంటి నుంచి దేవరకొండ రోడ్డులో ఉన్న వారి వ్యవసాయం పొలం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కిష్టారెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ వెంట కదిలారు. పెద్ద ఎత్తున జనం అంతిమయాత్రకు తరలివచ్చారు. ఆయన కుమారుడు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top