ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు! | Engineering counseling schedule delayed due to problems | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు!

May 20 2026 4:03 AM | Updated on May 20 2026 4:03 AM

Engineering counseling schedule delayed due to problems

కొలిక్కిరాని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 

న్యాయస్థానం ముందు వివాదం.. ఎప్పుడిస్తారో తేల్చని ప్రభుత్వం 

నేరుగా విద్యార్థికే చెల్లింపు అంటున్న సర్కార్‌..ముందే వసూలుకు కాలేజీలు సిద్ధం 

సమస్యల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జాప్యం 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలవ్వగానే కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తారు. కరోనా కాలంలో మినహా గత పదేళ్లలో జూన్, జూలైలో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల ప్రక్రియ మొత్తం ముగించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దాదాపు నెల రోజుల ముందే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వస్తున్నారు. 

కానీ ఈ ఏడాది ఈఏపీసెట్‌ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌ పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు కంప్యూటర్‌ తెరపై కనిపించే ఏర్పాట్లూ ఈ ఏడాది నుంచే మొదలు పెట్టారు. దీంతో ఎవరి ర్యాంకు ఏమిటో తెలుసుకోగలిగారు. దీని ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందనే అంచనాకు విద్యార్థులు వచ్చారు. ఈ దశలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్న తీరు పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మల్లగుల్లాలు 
ఫీజు రీయింబర్స్‌పై గత ఏడాది నుంచి న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. బకా యిలతోపాటు ప్రతీ సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించాలని ప్రైవేట్‌ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించాయి. ఇక నుంచి తప్పకుండా చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏ గడువులోగా చెల్లిస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు. ఈ అంశం ఇప్పటికీ న్యాయస్థానం ముందు ఉంది. 

దీనికితోడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులకు నేరుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ప్రైవేటు కాలేజీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే వరకూ నిరీక్షిస్తే కాలేజీల నిర్వహణ కష్టమవుతుందని వాదిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థి ఖాతాలో ఫీజులు వేసినా, కాలేజీలకు సకాలంలో చెల్లించకుండా, ఇతర అవసరాలకు వాడుకుంటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 

ఫీజు రీయింబర్స్‌ ఇవ్వడంలో ఆలస్యమైతే, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజు లు కట్టమని ఒత్తిడి తెస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించడం సరికాదని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలతో చర్చించిన తర్వాతే తేదీ ల షెడ్యూల్‌ ఇస్తామని చెబుతున్నారు.  షెడ్యూ ల్‌ విడుదల చేయని పక్షంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే వీలుంది.  

Advertisement
 
Advertisement
Advertisement