నీటి పైపులైన్ల నుంచి విద్యుత్‌!

Electricity from water pipelines - Sakshi

కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్‌ పైపులైన్లలో ఏర్పాటుకు యోచన

సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న అధికారులు

35 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చనే అంచనా

సాక్షి, హైదరాబాద్‌: భారీ నీటి పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. విద్యుత్‌ ఉత్పత్తి చేసే దిశగా విద్యుత్‌ రంగ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఏ మేరకు ఉంది, ఎంత విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న దిశగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కోదండాపూర్‌ నుంచి సాహెబ్‌ నగర్‌ (గ్రేటర్‌ శివారు) మార్గంలో 130 కిలోమీటర్ల పొడవునా ఉన్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఎక్కువగా ఉన్నచోట టర్బైన్లను ఏర్పాటు చేయాలని.. వాటి నుంచి సుమారు 35 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, టర్బైన్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానించాలని హైదరాబాద్‌ జల మండలి (వాటర్‌ బోర్డు) నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.

కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేలా?
జల మండలి ప్రస్తుతం హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నగరం నలుమూలలా సరఫరా కోసం సుమారు 200 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.75కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు నీటి పైపులైన్లలో విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికతను వినియోగి స్తున్నారు. సాగునీళ్లు, తాగునీళ్లతోపాటు పలుచోట్ల సీవరేజీ పైపులైన్లలో కూడా డైనమోలు అమర్చి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ నీటి పైపులైన్లలో ఏర్పాటు చేయాలని జల మండలి భావిస్తోంది. తొలుత కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్‌ పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. అది సఫలమైతే గోదావరి పైపులైన్లలోనూ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. ఈ టర్బైన్ల వల్ల నీటి సరఫరా వేగం తగ్గడం, పంపులు నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయా, ఎలాంటి చోట్ల ఏర్పాటు చేయవచ్చు, ఇబ్బందులేమైనా వస్తే ఎలా అధిగమించాలన్న దానిపై అధ్యయనం జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉందని అంటున్నాయి.

భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ఉన్న పవర్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయిన తరహాలోనే.. పైపులైన్ల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టుల వద్ద చాలా ఎత్తులో ఉండే నీళ్లను పవర్‌ ప్లాంట్‌లోకి పంపుతారు. అలా దూసుకొచ్చే నీళ్లు భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతూ కిందికి వెళ్లిపోతాయి. ఈ క్రమంలో టర్బైన్లకు అమర్చిన భారీ డైనమోలలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో నీళ్లు వేగంగా దూసుకెళ్లే పైపులైన్లలో అమర్చే హైడ్రోడైనమిక్‌ టర్బైన్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. పైపులైన్లలో మాత్రమే కాకుండా నిరంతరం నీటి ప్రవాహం ఉండే కాల్వల వద్ద కూడా ఇలా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. 

ఏమిటీ డైనమో? 
యాంత్రిక శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే పరికరాలే డైనమోలు. సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఉపయోగించే ఫ్యాన్లు, నీటి మోటార్ల వంటివే. విద్యుత్‌ సరఫరా చేసినప్పుడు మోటార్‌కు ఉండే ఫ్యాన్‌ (షాఫ్ట్‌) తిరుగుతుంది. 

డైనమోలు దీనికి ప్రతిగా (రివర్సులో) పనిచేస్తాయి. డైనమోకు ఉండే ఫ్యాన్‌ (షాఫ్ట్‌)ను తిప్పితే.. దాని నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు వేగంగా ప్రవహిస్తున్న నీళ్లు టర్బైన్‌ను తిప్పుతాయి. దీంతో ఆ టర్బైన్‌కు అనుసంధానం చేసిన డైనమో షాఫ్ట్‌ కూడా తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. 

డైనమోలో.. రెండు శక్తివంతమైన అయస్కాంతాలను రెండు వైపులా బిగిస్తారు.. మధ్యలో రాగి,అల్యూమినియం వంటి లోహపు తీగలను చుట్టలుగా చుట్టి ఒక కడ్డీ (షాఫ్ట్‌) ద్వారా వేలాడదీస్తారు. షాఫ్ట్‌ను తిప్పినప్పుడు లోహపు చుట్టలు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి లోహపు తీగల్లో విద్యుత్‌ను పుట్టిస్తుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top