మైకులు బంద్‌..

Dubbaka By Election Campaign Ends - Sakshi

దుబ్బాకలో ముగిసిన ప్రచారం

చివరిరోజు పోటాపోటీగా పార్టీల ప్రచారం

మంగళవారం పోలింగ్‌ భారీగా పోలీసుల మోహరింపు 

సాక్షి, సిద్దిపేట: నెల రోజులుగా మైకుల మోతలు, నాయకుల ప్రచారాలు... ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లతో హోరెత్తిన దుబ్బాక నియోజకవర్గం ఆదివారం సాయంత్రానికి ఒక్కసారిగా మూగబోయింది. 3న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆదివారంతో ప్రచార పర్వానికి తెరపడింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, మోటారు సైకిల్‌ ర్యాలీలు, ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రచారసారథి, మంత్రి హరీశ్‌రావు ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో కూడిన లేఖను సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నియోజకవర్గం అంతా కలియతిరిగి సభలు, సమావేశాలు, రోడ్‌ షోల్లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.  

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫేస్‌ బుక్, జూమ్‌ ద్వారా కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుబ్బాకలో విలేకరుల సమా వేశంలో టీఆర్‌ఎస్, బీజేపీలను దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల నాయకలు ఒకే గూటి పక్షులని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి మద్దతుగా రోడ్‌షోలు నిర్వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించి రాష్ట్రానికి పట్టిన శని వదిలించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతోపాటు, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేగుంట మండలంలో రోడ్‌షో నిర్వహించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు చేశారు. ఆఖరిరోజు కావడంతో నాయకులు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు.  

2,500 మంది పోలీసులు 
దుబ్బాక ఉప ఎన్నికపై మొత్తం రాష్ట్రం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. గత నెల 26న సిద్దిపేటలో నోట్ల కట్టల లొల్లి సంఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు పెంచారు. రెండు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ఏపీఎస్‌పీ బెటాలియన్లతోపాటు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి పోలీసులకు దుబ్బాక నియోజకవర్గంలో డ్యూటీలు వేశారు. హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు మొత్తం 2,500 మంది పోలీసులను మోహరించారు. 89 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు అందరూ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top