కాలుతూ.. పేలుతూ..

Distribution Transformers Often Burn Out Due To Management Error - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్వహణ లోపానికి తోడు.. హెచ్చు తగ్గులను నియంత్రించే వ్యవస్థ సరిగా లేకపోవడంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌) తరచూ కాలిపోతున్నాయి. ఫలితంగా గ్రేటర్‌ జిల్లాల పరిధి లోని తొమ్మిది సర్కిళ్లలో 2020– 21లో 1,597 డీటీఆర్‌లు కాలిపోగా, 2021– 22లో 2,035 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు డిస్కం పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో తలెత్తిన నిర్వహాణ లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్వహణ లోపంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

ఏటా రూ.100 కోట్లకుపైగా..  
విద్యుత్‌ లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లూజు లైన్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌ లీకేజీలను గుర్తించి, వాటిని నియంత్రించడంæ, దెబ్బతిన్న ఫ్యూజ్‌ బాక్స్‌ల పునరుద్ధరించడం, విద్యుత్‌ సరఫరాలో తలెత్తే హెచ్చు తగ్గుల నియంత్రణ కోసం ఫీడర్, డీటీఆర్‌ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్‌ సిస్ట్‌ం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. 

బినామీ కాంట్రాక్టర్లుగా ఇంజినీర్లు.. 
క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈలు, డీఈలు ఎప్పటికపుడు లైన్‌ టు లైన్‌ తనిఖీ చేసి, లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దాలి. వీరెవరూ ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ఇంజినీర్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. లైన్ల నిర్వహణ చేజిక్కించుకుంటున్నారు. లైన్ల పునరుద్ధరణ పనులు చేసినట్లు బిల్లులు గుట్టుగా డ్రా చేస్తున్నారు. రాజేంద్రనగర్, సైబర్‌సిటీ, సరూర్‌నగర్, మేడ్చల్‌ సర్కిళ్లలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలిపోయిన డీటీఆర్‌లకు డిస్కం రిపేర్లు నిర్వహించాల్సి ఉంది. రవాణా చార్జీలు సహా రిపేరు ఖర్చులను కూడా డిస్కమే భరించాల్సి ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వినియోగదారులే ఈ భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది.  

ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది..  
ప్రస్తుతం నగరంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం కూడా ప్రారంభమైంది. ఫలితంగా విద్యుత్‌ వినిÄయోగం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజు సగటు విద్యుత్‌ వినియోగం 87.1 మిలియన్‌ యూనిట్‌గా నమోదైంది. ఈ నెలారంభంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2,500 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 2,794 మెగావాట్లకు చేరుకుంది. ఈ నెల చివరి నాటికి 3,000 మెగావాట్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.  

(చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top