‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’

Degree Student Aishwarya Suicide Because Of Financial Problems Parents Says - Sakshi

ఆర్థిక ఇబ్బందులే నా కూతుర్ని పొట్టనపెట్టుకున్నాయి

డిగ్రీ విద్యార్థిని ఐశ్యర్య తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్థిక ఇబ్బందులే తమ కూతుర్ని  పొట్టనపెట్టుకున్నాయని షాద్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులు వినడానికై కనీసం తమ కూతురికి ఫోన్‌ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు.

సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘:ఐశ్యర్య మొదటి నుంచి చదువులో ఎంతో ముందుండేది. ఉన్నత చదువు కోసం అప్పు చేసి మరీ ఆమెను ఢిల్లీకి పంపించాం. కూతుర్ని ఐఏఎస్‌ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు వినడం కోసం ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ అడిగింది. మా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫోన్‌ కూడా కొనివ్వలేకపోయాం. చనిపోయే ముందు కూడా ఐశ్యర్య మా అందరితో కలివిడిగానే మాట్లాడింది. స్కాలర్‌షిప్‌ రాకపోవడం ఐశ్యర్యను మరింత కుంగదీసింది. గతంలో మా కూతురు టాపర్‌గా నిలిచినప్పుడు ఎందరో అండగా ఉంటామని ముందుకు వచ్చారు, కానీ కొద్దిరోజులకే ముఖం చాటేశారు. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావొద్దు’ అని ఐశ్యర్య తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకొని తమ చిన్న కూతురు చదువుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 
(చదవండి : ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్‌ స్పందన)

షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్‌ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్‌ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్‌షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్‌షిప్‌ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్‌ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top