
అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారాన్ని అందజేస్తున్న మంత్రులు జూపల్లి, పొన్నం
12 వేల గ్రామ పంచాయతీల్లో దాశరథి రచనలు పెడతాం: మంత్రి జూపల్లి
కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం ప్రదానం
గన్‌పౌడ్రీ (హైదరాబాద్): తెలంగాణ కీర్తికి ప్రతీక అయిన దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించేందుకు త్వరలో కార్యాచరణ ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేశారు.
జూపల్లి మాట్లాడతూ.. అణచివేతకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి దాశరథి అని, ఆయన తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. 1944లో కవి సమ్మేళనం పెడితే నిజాం నిప్పు పెట్టించారని, అయినా బెదరకుండా అక్కడే సమ్మేళనం నిర్వహిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా ›గ్రామ పంచాయితీల్లో దాశరథి రచనలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.
తెలంగాణ సాహితీమూర్తుల రచనలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు, యువతలో క్రీడలపట్ల ఆసక్తి కలిగించేందుకు నిధులను కేటాయిస్తామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, సంస్కృతికి దాశరథి ఐకాన్ అని, ఆయన ప్రభావంతో ఎందరో కవులు సామాజిక స్పృహతో రచనలు చేశారని చెప్పారు.
పురస్కార గ్రహీత దేవేందర్ మాట్లాడుతూ... దాశరథి అంటేనే ఒక ధిక్కారమని, నిరంకుశత్వంపై పోరాడారని గుర్తుచేశారు. అయన పేరిట నెలకొల్పిన అవార్డు తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘మూడు దశబ్దాలుగా కవితలు రాస్తున్నాను. సకల సమస్యలపై ప్రశ్నించడంపైనే నా కలం సాగుతుంది. నా కవితలన్నీ గ్రామీణ భాషలోనే ఉన్నాయి. తెలంగాణ మహనీయుల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఉంది.. కానీ తెలంగాణ యాసలో పాఠ్యపుస్తకాలు లేవు’అని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి అందెశ్రీ, ప్రజాకవి జయరాజు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, దాశరథి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.