40 ప్రైవేట్‌.. 99 ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు

Corona Virus Vaccine Distributed In 40 Private And 99 Government Hospitals - Sakshi

తొలి రోజు టీకా వేసే ఆసుపత్రులను ప్రకటించిన సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న నిర్వహించనున్న తొలి టీకా కార్యక్రమం వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొదటి రోజు టీకాకు 139 కేంద్రాలను ఎంపిక చేయగా.. అందులో 99 ప్రభుత్వ ఆసుపత్రులు, 40 ప్రైవేట్‌ ఆసుపత్రులున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా 13, మేడ్చల్‌లో 11, రంగారెడ్డి జిల్లాలో 9 ఆసుపత్రులను ఎంపిక చేశారు. అంటే ఈ మూడు జిల్లాల్లోనే 33 టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక టీకా కార్యక్రమం ప్రారంభం రోజున గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

పోలియో వ్యాక్సినేషన్‌ వాయిదా... 
తొలిరోజు వ్యాక్సిన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత 17న టీకాలకు సెలవు ప్రకటించారు. ఆ రోజు నిర్వహించాల్సిన పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18న తిరిగి కరోనా టీకాల కార్యక్రమం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 ఆసుపత్రుల్లో 1,400 టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం సహా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మొత్తం కేంద్రాల్లో 170 వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. 4 రోజులే కరోనా టీకాలు వేస్తున్నందున 2.90 లక్షల వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేయడానికి 2 వారాలు పడుతుందని తెలిపారు. ఇదిలావుంటే దాదాపు 2 లక్షల మంది ఉన్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వచ్చే నెల ఒకటో తేదీ తర్వాత కరోనా టీకా మొదటి డోసు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌ సాఫ్ట్‌వేర్‌పై నీలినీడలు 

  • డ్రైరన్‌లో తలెత్తిన సమస్యలతో తలలు పట్టుకుంటున్న యంత్రాంగం 
  •  ఆఫ్‌లైన్‌ ద్వారా రికార్డు పుస్తకంలో నమోదు చేయాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా డ్రైరన్‌లో భాగంగా కోవిన్‌ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ప్రత్యేక రికార్డు పుస్తకంలో లబ్ధిదారుల సమాచారాన్ని రాయాలని, తద్వారా టీకాల కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా కొనసాగించాలని కేంద్రం ఆదే శించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన అనంతరం ఆయా వివరాలను కోవిన్‌ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు చేసింది. 

వ్యాక్సినేషన్‌కు దూరంగా కొందరు..
వ్యాక్సినేషన్‌ విధులకు కొందరు వైద్య సిబ్బంది దూరంగా ఉంటుండటంపై ఆందోళన నెలకొంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా డ్రైరన్‌ జరిగింది. ఇందులో 25 మంది వైద్య సిబ్బంది పాల్గొనాల్సి ఉన్నా కొందరు డుమ్మాకొట్టారు. ఇటు టీకా స్వచ్ఛందం కావడంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని కొందరు వైద్యులు, ఇతర సిబ్బంది తమకు టీకాలు అవసరం లేదంటూ నేరుగా ఆయా ఆసుపత్రుల ద్వారా లేఖలు ఇవ్వడం సంచలనం రేపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top