స్థానిక వ్యాపారులను కాదని టెండర్లను బడా సంస్థలకు తక్కువ ధరకు కట్టబెట్టే యత్నం
మార్చిలో గోదాములవారీగా టెండర్లు పిలిచి తర్వాత రద్దు
ఆపై బల్క్ టెండర్ల పేరుతో రూ. 100 కోట్ల టర్నోవర్ కంపెనీల కోసం ప్రకటన
బిడ్లు దాఖలు చేసిన ఐదు బడా కంపెనీలు.. మార్కెట్ ధర రూ. 1,700 ఉంటే రూ. 1,400 – రూ. 1,500 కోట్
పౌల్ట్రీ రైతులు రూ. 1,600 ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఇవ్వని వైనం
టెండర్లలో అవకతవకలు, తాజా కొనుగోళ్ల తీరుపై సర్కార్ సీరియస్
రాత్రికి రాత్రే ఎండీని బదిలీ చేసిన ప్రభుత్వం.. ఐఏఎస్ రాహుల్ రాజ్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకునే మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఖరీఫ్ సీజన్‌లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను విక్రయించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రైతుల నుంచి రూ. 2,400కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రూ. 1,400 నుంచి రూ. 1,500లోపు అంటే దాదాపు రూ. 1000 నష్టానికి బల్క్‌గా విక్రయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పౌల్ట్రీ రైతులు రూ. 1,600కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా గోదాములవారీగా చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700లోపు మక్కలు కొనేందుకు సిద్ధపడినా ఆ టెండర్లను రద్దు చేసి మరీ బల్క్ టెండర్ల ద్వారా బడా సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొన్న ఐదు బడా కంపెనీలు కనీస మద్దతు ధరకన్నా రూ. 1,000 వరకు తక్కువకు కోట్ చేసినట్లు సమాచారం. నేడో, రేపో ఆయా సంస్థలకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, ప్రభుత్వానికి ఉప్పందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హఠాత్తుగా మార్క్‌ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్‌ను మార్క్‌ఫెడ్ ఎండీగా నియమించింది.
రూ. 950 కోట్ల విలువకు కొనుగోలు చేసి ....
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగవుతోంది. అందులో భాగంగానే గత ఖరీఫ్‌లో దాదాపు 9 లక్షల ఎకరాల్లో సాగు చేయగా భారీ ఎత్తున మక్కలు మార్కెట్‌కు వచ్చాయి. మార్కెట్‌లో అప్పట్లో ధర రూ. 2,000 కూడా లేకపోవడంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,400 చొప్పున 3.97 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రైతులకు దాదాపు రూ. 950 కోట్ల వరకు వెచ్చించిన మార్క్‌ఫెడ్... రవాణా, గోనె సంచులు, గోదాముల్లో నిల్వ కోసం భారీగానే వెచ్చించింది. కొనుగోలు చేసిన మక్కలను విక్రయించే విషయంలో మార్క్‌ఫెడ్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో ధర లేదనే కారణంగా విక్రయించే విషయంలో మీనమేషాలు లెక్కించిన అధికారులు.. మార్చిలో గోదాములవారీగా టెండర్లను ఆహా్వనించారు. దాదాపు 200 గోదాముల్లో మక్కలను నిల్వ చేయగా గోదాములవారీగా పిలిచిన టెండర్లలో పాల్గొన్న చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు వెచ్చించి మక్కలు కొనేందుకు ముందుకొచ్చారు. కానీ అధికారులు హఠాత్తుగా ఆ టెండర్లను రద్దు చేశారు. వెంటనే పౌల్ట్రీ వ్యాపారుల ప్రతినిధులు మార్క్‌ఫెడ్ అధికారులను సంప్రదించి క్వింటాలుకు రూ. 1,600 చొప్పున మక్కలను కొంటామని, పౌల్ట్రీ దానా కోసం ఇతరుల నుంచి కొనే బదులు మార్క్‌ఫెడ్ నుంచే తీసుకొంటామని ముందుకొచ్చారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోకుండా బల్క్ టెండర్లు పిలిచారు.
రూ. 100 కోట్లపైన టర్నోవర్ నిబంధనతో...
బల్క్ టెండర్ల ద్వారా ఒకేసారి మక్కలను విక్రయించి గోదాములను ఖాళీ చేస్తామని చెప్పిన మార్క్‌ఫెడ్ అధికారులు.. ఈ మేరకు గత నెలలో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ. 100 కోట్లపైన టర్నోవర్ కలిగిన సంస్థలే పాల్గొనాలనే నిబంధన విధించారు. దీంతో కేంద్రీయ బండార్, నాకాఫ్, వి–కేర్, మంచుకొండ ఆగ్రో ఇండస్ట్రీస్, అమరావతి కంపెనీలు ముందుకొచ్చాయి. 2022–23 రబీలో మిల్లర్లు మాయం చేసిన రూ. 7,000 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టేందుకు 2023లో పిలిచిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలే ఈ మక్కల బల్క్ టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ధాన్యం రికవరీకి బదులు డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కంపెనీలు సగంలోనే చేతులెత్తేశాయి. ఈ కంపెనీలే తిరిగి మక్కల టెండర్లలో పాల్గొని క్వింటాలుకు రూ. 1,400 నుంచి రూ. 1,500 చొప్పున కొనేందుకు బిడ్లు వేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్‌లో జరుగుతున్న మక్కల టెండర్ల దందా గురించి సర్కార్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలియవచ్చింది. అందులో భాగంగానే ఆకస్మాత్తుగా మార్క్‌ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మక్కల టెండర్ల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.


