
ప్రభుత్వ పరంగా జీఓ ఇచ్చి ముందుకెళ్లటం వైపే మొగ్గు..?
సీఎంతో మంత్రుల కమిటీ భేటీలో మెజారిటీ అభిప్రాయం
ప్రభుత్వానికి మూడు సిఫారసులు చేసిన మంత్రుల కమిటీ
విస్తృతంగా చర్చ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయిన నేతలు
మరింత లోతుగా చర్చించేందుకు మరోసారి భేటీకి నిర్ణయం
కేబినెట్ సమావేశంలోనూ చర్చించాలని తీర్మానం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇంకా తేలలేదు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులతోపాటు గత రెండు రోజులుగా జరిగిన మంత్రుల బృందం భేటీ.. సీఎం, పీసీసీ అధ్యక్షుల సమ క్షంలో జరిగిన చర్చల్లోనూ తుది నిర్ణయానికి రాలేక పోయారు. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల తర్వాతే పార్టీ వైఖరి స్పష్టమవుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
తొందరపాటు వద్దు
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సంప్రదింపుల కోసం పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మూడు ప్రత్యామ్నాయాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. ఈ మూడింటిని గురువారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రుల బృందం వివరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రుల బృందం సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్కలు పాల్గొన్నారు. మూడు ఆప్షన్లపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారని తెలిసింది.
అయితే, మెజారిటీ నాయకులు మాత్రం ప్రత్యేక జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. బీసీ వర్గాలకు న్యాయం చేసే విషయంలో హడావుడిగా నిర్ణయం తీసుకునేదాని కంటే పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మరింత కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 30న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించి మంత్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
బుధవారం గాంధీభవన్‌లో మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, వాకిటి శ్రీహరి, పార్టీ నేతలు వి.హనుమంతరావు, పి. వినయ్‌కుమార్, ఈరవత్రి అనిల్ పాల్గొని ఢిల్లీ న్యాయ నిపుణులు ఇచ్చిన అభిప్రాయాల మేరకు మంత్రుల బృందం చేయాల్సిన సిఫారసులపై చర్చించారు.
మంత్రుల బృందం సిఫారసులివే..!
» స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ఆర్డినెన్సుకు మరో నెలరోజుల్లో మూడు నెలలు పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు కేసు కూడా ఈలోపు ఓ కొలిక్కి వస్తుంది. అప్పటివరకు వేచి చూస్తే బాగుంటుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రభుత్వ పక్షాన కొంత గడువు కోరుతూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి. ఆర్డినెన్సు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేయాలి.
» వేచి చూసే అవకాశం లేకపోతే ప్రభుత్వ పరంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. ఈ ఉత్తర్వులపై ఎవరైనా కోర్టులకు వెళితే కులగణన ఆధారంగా వచ్చిన శాస్త్రీయ గణాంకాలను కోర్టు ముందుంచి పోరాడాలి. కోర్టులు కూడా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కేవియట్ దాఖలు చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి.
» ఈ రెండు ప్రతిపాదనలు కాదంటే పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలి.
సింఘ్వి సలహానే సరైందా..?
గురువారం సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో వీలున్నంత త్వరగా ఎన్నికలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే, పార్టీ పరంగా మరింత దృఢంగా వ్యవహరించాలని, బీసీ వర్గాలకు న్యాయం చేసే విషయంలో వెనక్కు తగ్గవద్దనే చర్చ కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ, న్యాయ కోవిదుడు అభిషేక్ మనూ సింఘ్వి ఇచ్చిన సలహా మేరకు సుప్రీంకోర్టులో కేసు తేలేవరకు వేచి ఉండడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి వెళ్లాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డట్లు సమాచారం.