ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సత్కరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
జూన్ 1 కల్లా హెల్త్ కార్డులు అందిస్తాం
రెండో పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలని కమిటీకి ఆదేశం
నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం
ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై నివేదిక ఇవ్వాలి
మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం
సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదే
టీఈజేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం
5 నుంచి తలపెట్టిన నిరసనలన్నింటినీ రద్దు చేసిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: రిటైరైన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రానున్న వందరోజుల్లో కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీఈజేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్ హుస్సేన్, జి.సదానందంగౌడ్, చావ రవి, వి.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలను జేఏసీ నేతలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ‘వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.6 వేల కోట్లు చెల్లిస్తాం. రెండో పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించా. అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం. జూన్ 1లోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలి’ అని చెప్పారు.
ఉద్యోగుల కోసం చేస్తున్నాం...
‘ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలు గుతున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టింది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదీ: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రభుత్వం చాలా వరకు పరిష్కరించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఉండకుండా చేస్తాం. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. దీనిపై కసరత్తు చేసి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు పెన్షన్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదీ. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి మానవీయ దృక్పథంతో ఆలోచించారు. మీ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
సీఎంకు నాయకుల కృతజ్ఞతలు
సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాల పట్ల టీఈజేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గతంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 5న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతోపాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.


