దళితులపై చేయి పడితే ఊరుకోం

CM KCR Meets With Telangana Congress Leaders - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిక

సీఎంను కలసిన సీఎల్పీ బృందం

సాక్షి, హైదరాబాద్‌: దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. అలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. దళితుల విషయంలో సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. దళితులతో పాటు పేదల పట్ల, పోలీసుల ఆలోచనా ధోరణి సానుకూలంగా ఉండాలని పేర్కొన్నారు. దొంగతనం కేసులో పోలీసుల చిత్రహింసలకు గురై లాకప్‌డెత్‌కు గురైన దళిత మహిళ మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.15 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుమార్తెలిద్దరికీ చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

ఈనెల 28న స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీలు బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి రావాలని సూచించారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, కె.రాజగోపాల్‌రెడ్డి, టి.జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతమ్‌లు శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ, ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్‌ నాయకులతో చర్చించారు.

అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించండి
మరియమ్మ లాకప్‌ డెత్‌ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని, క్షమించదని కేసీఆర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో గుణాత్మక వృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, జాప్యం చేయకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. చింతకానికి వెళ్లి ఘటన పూర్వాపరాల గురించి తెలుసుకుని బాధితులను పరామర్శించాలని కూడా ఆయనకు సూచించారు. 

ఆ కుటుంబాన్ని ఆదుకోండి
మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, ఆమె మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వద్ద భట్టి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనుల లాకప్‌డెత్‌లు పెరిగాయని విమర్శించారు. పోలీసులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన స్వేచ్ఛతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఇలావుండగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి మరియమ్మ లాకప్‌డెత్‌పై వినతిపత్రం అందజేసింది. 

జగ్గారెడ్డీ.. మెడికల్‌ కాలేజీ ఇచ్చినం కదా..
సీఎం తనను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఇతర అంశాలపై కూడా కొంతసేపు మాట్లాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డినుద్దేశించి ‘జగ్గారెడ్డీ... మీ నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఇచ్చినం కదా..’అని అన్నారు. ఇందుకు స్పందించిన జగ్గారెడ్డి.. ‘థ్యాంక్స్‌ అన్నా, కానీ ఎంపిక చేసిన స్థలంలోనే కాలేజీ కట్టేలా చూడండి’అని విజ్ఞప్తి చేయగా ‘అక్కడే కడతారు’అని కేసీఆర్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి శ్రీధర్‌బాబు, తన నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుకు భూసేకరణ గురించి రాజగోపాల్‌రెడ్డిలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు. ఐకేపీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల గురించి కూడా వారితో మాట్లాడారు. చైనా, భారతదేశాల మధ్య విధానాల అమలులో ఉన్న తేడాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్‌ నేతలకు సీఎం అపాయింట్‌మెంట్‌ లభించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. దీనిపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top