మంటలా.. పంటలా? ఏ తెలంగాణ కావాలో తేల్చుకోవాలి: సీఎం కేసీఆర్‌   | Cm Kcr Emotional Speech On Meeting In Kongara Kalan Hyderabad | Sakshi
Sakshi News home page

మంటలా.. పంటలా? ఏ తెలంగాణ కావాలో తేల్చుకోవాలి: సీఎం కేసీఆర్‌

Aug 26 2022 1:50 AM | Updated on Aug 26 2022 9:55 AM

Cm Kcr Emotional Speech On Meeting In Kongara Kalan Hyderabad - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘అనేక మంది ఆత్మ బలిదానాలు, ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కొందరు మత పిచ్చిగాళ్లు, రక్త పిశాచులు, విచ్ఛిన్నకర శక్తులు ఆగం చేసేందుకు యత్నిస్తున్నారు. కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, బుద్ధి జీవులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా తెలంగాణ సమాజం అంతా మళ్లీ మోసపోతుంది. మన బతుకులు ఆగమైపోతాయి.

మంటల తెలంగాణ కావాలో? పంటల తెలంగాణ కావాలో తేల్చుకోవాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ శివార్లలోని కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే తెలంగాణ సమాజం మోసపోయి గోసపడే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. సభలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

అంతా రాజకీయం.. అరాచకం.. 
‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తోంది. కులాలు, మతాల పేరుతో జాతిని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోంది. దేశంలో దరిద్రపు గొట్టు, దౌర్భాగ్యపు పాలన కొనసాగుతోంది. ప్రజా స్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోస్తోంది. ఏదైనా కూలగొట్టడం సుల భం.. నిర్మించడమే కష్టం. మోదీ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల దోసే పని పెట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆఫర్‌ ఇచ్చి ంది. నిరాకరించిన వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలను కూడా ఇబ్బందులు పెడుతోంది. ప్రజలు ఎనిమిదేళ్లు చాన్స్‌ ఇచ్చారు. మోదీకి ఉన్న ప్రధాని పదవి చాలదా? ఇంకా సరిపోదా?  ఇది రాజకీయమా? అరాచకమా? దీన్ని చూస్తూ భరించాలా? మోదీకి వ్యతిరేకంగా జతకట్టి పిడికిలి ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది. బుద్ధి జీవులు, యువకులు పోరాటంలో కలిసిరావాలి. 

మొనగాడివైతే 24 గంటల కరెంటు ఇవ్వు! 
నేను తెలంగాణకు సీఎంగా ఎన్నికైన సమయంలోనే మోదీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో దేశానికి ఏ ఒక్క మంచిపనైనా చేశారా? దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, మంచి నీటి సరఫరా, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు అమలవుతున్నాయి. మోదీ నువ్వు మొనగాడివే అయితే దేశానికి 24 గంటల నాణ్యమైన కరెంటు, మంచినీరు సరఫరా చేసి చూపించాలి. 

రంగారెడ్డి జిల్లా బంగారు కొండ 
దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉంటే.. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా ఓ బంగారు కొండ. ఇక్కడ ఎక్కడైనా ఎకరం కనీసం కోటికిపైనే పలుకుతుంది. ప్రతిరైతు కోటీశ్వరుడే. అయితే మతపిచ్చిలో పడితే మాత్రం బతుకులు నాశనమవుతాయి. పనికిమాలినవాళ్లు, నీచులు, మతం పేరుతో అల్లకల్లోలం సృష్టిస్తే చూస్తూ ఊరుకోవద్దు. ఓట్ల కోసం జాతిని చీల్చే వారిని వదలొద్దు. కృష్ణా జలాల వాటాపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపితేగానీ అభివృద్ధి సాధ్యంకాదు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రతి నియోజకవర్గానికి గతంలో రూ.5 కోట్లు మంజూరు చేశాం. మళ్లీ మరో రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీలైనంత త్వరలోనే జీవోలు విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, మహేందర్‌రెడ్డి, వాణిదేవి, దయానంద్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, యాదయ్య, జైపాల్‌యాదవ్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

బెంగళూరును నాశనం చేశారు
సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరును మత పిచ్చిగాళ్లు నాశనం చేశారు. మొన్నటివరకు ఐటీ ఎగుమతులు, ఉపాధి అవకాశాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉండేది. మత విద్వేషాల కారణంగా ఉపాధి అవకాశాలు పడిపోయాయి. గత ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు లేవు. ప్రశాంత వాతావరణం ఉంది. ఫలితంగా ఐటీలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. హైదరాబాద్‌లో 1.53 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. బెంగళూరులో ఆ సంఖ్య తగ్గిపోయింది. దీనికి మత పిచ్చి మంటలే కారణం. వాతావరణాన్ని కలుషితం చేస్తే ఉద్యోగాలు పోతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement