
రాజేంద్రనగర్: వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై పల్టీ కొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టి స్ట్రీట్ లైట్ స్తంభాన్ని నెలకూల్చి అవతలి రోడ్డుపై పడింది. అయితే అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బ్యాగ్‌లో ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
గుడిమల్కాపూర్ మహేంద్ర షోరూమ్‌లో మెకానిక్‌గా పని చేస్తున్న మహ్మద్ ఖలీల్ మంగళవారం సాయంత్రం షోరూమ్‌కు చెందిన కారును ట్రయల్ కోసమని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ఆరాంఘర్ వరకు వెళ్లి తిరిగి మెహిదీపట్నం వైపు పయనమయ్యాడు. పిల్లర్ నంబర్ 212 వద్దకు రాగానే అతి వేగం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రోడ్డు మధ్యలో స్ట్రీట్ లైట్ స్తంభాన్ని కూల్చి పల్టీ కొడుతూ పక్క రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది.
ఈ సంఘటనలో ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ కావడంతో ఖలీల్‌తో పాటు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.