
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి
మిగిలిన శాఖల ఆదాయం పరిస్థితేంటి?
ఉన్నతాధికారులను ప్రశ్నించిన మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: ‘వాణిజ్య పన్నుల్లో 4.7 శాతం, గనుల శాఖలో 18.6 శాతం మేరకు ఆదాయం పెరుగుదల కనిపిస్తోంది. మరి ఇతర ఆదాయార్జన శాఖల మాటేమిటి? ఎందుకు ఆయా శాఖలు ఆదాయ సమీకరణలో వెనుకబడ్డాయి?’అని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ప్రశ్నించింది. మిగిలిన శాఖల్లో కూడా ఆదాయం పెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది.
సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఓ ప్రాజెక్టులో పూడికతీతను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను గిరిజన ఏజెన్సీల ద్వారానే నిర్వహించాలని, వారికి యంత్ర సామగ్రి అందుబాటులో ఉండదు కనుక, ఐటీడీఏల్లోని ఇంజనీరింగ్ విభాగం ద్వారా సమకూర్చాలని సూచించారు. ఔటర్ రింగురోడ్డు లోపలి భాగంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్, లోకేశ్ కుమార్, శ్రీధర్, శశాంక, రాజీవ్‌గాంధీ హనుమంతు, సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.